STR_te_iev/61-1PE.usfm

244 lines
57 KiB
Plaintext

\id 1PE - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h పేతురు రాసిన మొదటి పత్రిక
\toc1 పేతురు రాసిన మొదటి పత్రిక
\toc2 పేతురు రాసిన మొదటి పత్రిక
\toc3 1pe
\mt1 పేతురు రాసిన మొదటి పత్రిక
\s5
\c 1
\p
\v 1 యేసుక్రీస్తు తన ప్రతినిధిగా పంపిన పేతురు అనే నేను, ఆయనపై నమ్మిక ఉంచిన మీకు ఈ లేఖ రాస్తున్నాను. ఆయన తనంతట తానే, మీరు తన వారిగా ఉండాలని ఏరి కోరి ఎంపిక చేసుకున్నాడు. మీ యధార్ధమైన మోక్ష గృహానికి దూరంగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితూనియ అనే ప్రాంతాల్లో చెదరిపోయి పరదేశులుగా ఉంటున్న మీకు శుభమని చెప్పి రాస్తున్న సంగతులు.
\v 2 మన తండ్రి అయిన దేవుడు తాను ముందుగా నిశ్చయించిన ప్రకారం మిమ్మల్ని ఎంపిక చేసి, మీరు క్రీస్తుకు విధేయులై జీవించాలనీ, క్రీస్తు రక్తం మిమ్మల్ని దేవునికి అంగీకారయోగ్యంగా, ఇష్టమైన వారుగా చేయాలనీ తన ఆత్మ ద్వారా మిమ్మల్ని ప్రత్యేకించాడు. దేవుడు మిక్కుటమైన దయను మీపై చూపును గాక. విస్తారమైన శాంతి సమాధానాలతో మిమ్మల్ని జీవింప చేయును గాక.
\s5
\p
\v 3 మన యేసు క్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. ఆయన మనపై తన దయను కుమ్మరించాడు, ఎంతో కనికరాన్ని చూపించాడు. యేసు క్రీస్తును చనిపోయిన తరువాత ఆయనను సజీవునిగా లేపడం ద్వారా దేవుడు తన మహా కనికరాన్ని బట్టి మనకు కొత్త జన్మనిచ్చాడు. ఇది మనకు ఒక సజీవమైన ఆశాభావాన్ని కలిగిస్తున్నది.
\v 4 దీని మూలంగా పరలోకం లోనివీ ఎప్పటికీ నాశనం కానివీ, వాడిపోనివీ, మచ్చ, డాగూ లేక ఎంతకాలమైనా భద్రంగా ఉండేవీ మనకు నిరీక్షించదగిన వారసత్వంగా లభించాయి.
\v 5 మీరు యేసును విశ్వసించారు గనుక దేవుడు తన మహా శక్తిచే మిమ్మల్ని కావలి కాస్తున్నాడు. ఈ ఆఖరి సమయాల్లో నివసిస్తున్న మనకు సాతాను శక్తి నుండి సంపూర్ణ విడుదల కలిగేలా ఆయన మిమ్మల్ని రక్షిస్తున్నాడు.
\s5
\p
\v 6 రకరకాల విషమ పరీక్షల వలన కొంతకాలం విచారించవలసి వచ్చినా ఆ తరువాత సంభవించబోయే వాటి వలన మీరు ఆనందిస్తారు. విలువైన లోహాలను శుద్ధమైనవో కావో పరిశోధించినట్టే మీరూ పరీక్షకు గురి కావడానికి దేవుడు అనుమతిస్తున్నాడు. మీరు ఎదుర్కొంటున్న ఈ శోధనలు ఎంతో ఆవశ్యకం.
\v 7 మీరు మనఃపూర్వకంగా యేసును విశ్వసించారని రుజువు చేయడానికే ఈ పరీక్షలు మీకు ఎదురౌతున్నాయి. అగ్ని వలన నాశనం అయ్యే బంగారమంతటి కంటే మీరు దేవునికి విలువైన వారని దీని అర్థం. మీరు యేసులో నమ్మకం ఉంచడం వల్ల ఆ యేసు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని ఎంతో యోగ్యులుగా ఎంచుతాడు.
\s5
\p
\v 8 మీరాయన్ని చూడకపోయినా ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని చూడకుండానే విశ్వసిస్తూ మాటల్లో చెప్పలేనంత దివ్య సంతోషంతో ఆనందిస్తున్నారు.
\v 9 ఆయనలోని మీ విశ్వాసాన్ని మీరు అనుభవ పూర్వకంగా రుచి చూస్తూ ఉంటే దేవుడు మీ పాపాల భారం నుండి మిమ్మల్ని తప్పిస్తూ ఉన్నాడు.
\v 10 ఒకానొక రోజు తాను మిమ్మల్ని ఎలా రక్షిస్తాడో దేవుడు తన ప్రవక్తలకు ముందుగానే చూపించి విశదపరిచాడు. చాలా కాలం క్రితమే ఈ విషయాలన్నీ వారు ఎంతో శ్రద్ధతో పరిశోధనాత్మకంగా గ్రహించి తమ సందేశాల ద్వారా వెల్లడి చేశారు.
\s5
\v 11 వారు తమలోని క్రీస్తు ఆత్మ ముందుగానే తెలియజేస్తున్న విషయాలను అంటే క్రీస్తు పొందనైయున్న బాధలు, ఆ తరువాత క్రీస్తుకు సంభవించనైయున్న దివ్యమైన విషయాలూ ఎప్పుడు, ఎలా జరగబోతున్నాయి అని తెలుసుకునేందుకు ఆలోచించి పరిశోధించారు.
\p
\v 12 దేవుడు ఈ విషయాలను వారికి వెల్లడించడం వారి కోసం కాదని అది మీ కోసమేనని ఆయన వారికి చెప్పాడు. వారు పరలోకం నుంచి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా సామర్ధ్యం పొందిన వారై మీకు సువార్త ప్రకటించారు. దేవదూతలు కూడా దేవుడు మనల్ని విమోచించే ఈ వాస్తవ సత్యాలు తెలుసుకోవాలని ఎంతో ఆశపడుతున్నారు.
\s5
\p
\v 13 కాబట్టి దేవునికి విధేయత చూపడానికి మీ మనసును సిద్ధపరుచుకోండి. నా ఉద్దేశ్యం ఏంటంటే మీరు క్రమశిక్షణతో స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. పరలోకం నుండి యేసు క్రీస్తు తిరిగి మీ మధ్యకు వచ్చినప్పుడు దేవుడు దయతో అనుగ్రహించే మేలైన విషయాలన్నింటినీ తప్పక పొందుతామనే సంపూర్ణమైన ఆశాభావం కలిగి ఉండండి.
\p
\v 14 ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు శరీర సంబంధమైన తమ తండ్రులకు పిల్లలు ఎలా విధేయులై ఉంటారో అలా మీరు మీ పరలోక జనకునికి విధేయులై ఉండండి. దేవుని గూర్చిన సత్యమెరుగని మీ పూర్వ అజ్ఞాన దశలో మీకున్న దురాశలను అనుసరించి ఇకమీదట ప్రవర్తించవద్దు.
\s5
\v 15 మిమ్మల్ని తన సొత్తుగా పిలిచినవాడు చెడు సమీపించరాని వాడు, పరిశుద్ధుడు. అలాగే మీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధులై ఉండండి.
\v 16 ఎందుకంటే "నేను పరిశుద్ధుడను కాబట్టి మీరూ పరిశుద్ధులుగా ఉండండి" అని పవిత్ర లేఖనాలలో రాసి ఉంది.
\p
\v 17 ప్రతి ఒక్కరి పని గురించీ పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేవాడు దేవుడు. అలాంటి ఆయనను మీరు తండ్రీ అని పిలుస్తున్న కారణాన భూమి మీద మీరు జీవించే కాలమంతా యుక్తమార్గంలో భయభక్తులతో గడపండి. తమ స్వస్థలాల నుండి వెళ్ళగొట్టబడిన వారు దూర ప్రాంతాలలో తమ ఇళ్ళకు తిరిగి చేరేవరకూ ఎంత జాగ్రత్తగా గడుపుతారో అలాగే మీరూ అలాంటి వారేననీ, మీ సొంత ఇల్లు అయిన పరలోకం నుండి వేరై దూరంగా గడుపుతున్నారని గుర్తుంచుకోండి.
\s5
\p
\v 18 మీ పూర్వీకుల నుంచి పారంపర్యంగా వచ్చిన వ్యర్ధమైన జీవన విధానం నుంచి దేవుడు మిమ్మల్ని వెల ఇచ్చి విమోచించాడు. ఇక మీదట అజ్ఞానంగా ప్రవర్తించడం మానండి. భక్తి శ్రద్ధలతో జీవించండి. ఎందుకంటే నేడుండి రేపు నాశనమైపోయే వెండి బంగారాల్లాంటి అశాశ్వతమైన వస్తువులతో కాక, అక్షయమైన ద్రవ్యాన్ని వెలగా చెల్లించి ఆయన మిమ్మల్ని స్వాధీనం చేసుకున్నాడు.
\v 19 క్రీస్తు మరణించినప్పుడు చిందించిన అమూల్యమైన, పవిత్రమైన రక్తాన్ని మూల్యంగా చెల్లించి దేవుడు మిమ్మల్ని కొన్నాడు. అమూల్యమైన రక్తంతో, అంటే యూదు యాజకులు అర్పిస్తున్న ఏ లోపం, కళంకం లేని గొర్రెపిల్లను పోలిన క్రీస్తు తన అమూల్య రక్తం ఇచ్చి, మిమ్మల్ని విమోచించాడు.
\s5
\v 20 విశ్వం ఉనికిలోకి రాక ముందే దేవుడు క్రీస్తును ఈ విషయానికై నియమించాడు. అయితే ఈ చివరి రోజుల్లోనే దేవుడు ఆయన్ని మీకు ప్రత్యక్ష పరిచాడు.
\v 21 క్రీస్తు చేసిన ఈ కార్యాన్ని బట్టి మీరు దేవునిపై నమ్మకం ఉంచారు. ఆ దేవుడే ఆయనను మరణం నుండి సజీవుడిగా లేపి అత్యధికంగా ఘనపరిచాడు. దాని ఫలితంగానే దేవుడు మీ నిమిత్తం కూడా గొప్ప కార్యాలు చేయగలడని నమ్మారు. మీ విశ్వాసం, ఆశాభావం దేవుని మీదే ఉన్నాయి.
\s5
\p
\v 22 దేవుని గూర్చిన సత్యానికి లోబడడం ద్వారా ఆయన మీ మనసుల్ని పవిత్రపరచడానికి అనుమతించడమే కాకుండా యథార్ధమైన సోదర ప్రేమను ఆయనను బట్టి పంచగలిగారు. అందుచేత ఆసక్తితో ఒకరినొకరు హృదయ పూర్వకంగా, గాఢంగా ప్రేమించుకోండి.
\v 23 ఎందుకంటే మీలో ఒక నూతనమైన జీవం మొదలై కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. మీరు పొందిన ఈ నూతన జీవితం ఏదో ఒక నశించిపోయే దానిపై ఆధారపడి లేదు. ఎప్పటికీ స్థిరంగా నిలిచి ఉండేవీ, మీరు నమ్ముతున్నవీ అయిన దేవుని వాగ్దానాలనే ఆధారం చేసుకుని ఉంది.
\s5
\v 24 ఇదంతా సత్యమని మనకి తెలుసు. యెషయా ప్రవక్త రాసినట్టు,
\q1 "మానవులంతా గడ్డిలాంటి వారు.
\q1 వారి వైభవమంతా గడ్డి పువ్వు లాంటిది.
\q గడ్డి ఎండిపోతుంది. పువ్వు రాలిపోతుంది.
\q
\v 25 ప్రభువు వాక్కు మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది."
\m ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండే ఈ క్రీస్తు సందేశమే మీకు సువార్తగా ప్రకటించడం జరిగింది.
\s5
\c 2
\p
\v 1 ప్రభువు దయగల వాడని మీరు రుచి చూశారు కాబట్టి, కక్షలతో కార్పణ్యాలతో ఇతరులను మోసం చేసే ఏరకమైన ప్రవర్తనా మీలో ఉండకూడదు. కపట వేషధారులుగా ఉండకండి. ఇతరులపై అసూయ పడకండి. ఎవరిని గురించీ చెడు మాటలూ అబద్ద ప్రచారాలూ చేయకండి.
\v 2 అప్పుడే పుట్టిన చంటి బిడ్డలు తల్లి పాలను ఆశించినట్టుగా, సత్య సంబంధమైన విషయాలను దేవుని నుండి ఆశించండి. అలా ఆ విషయాలను గ్రహించి నేర్చుకుంటున్న క్రమంలోనే, పిల్లలు యువకులుగా ఎదిగినట్టు, మీరును దేవుని ఎడల విశ్వాసంలో బలంగా ఎదుగుతారు. ఈ లోకపు పాపమంతటినుండీ దేవుడు మిమ్మల్ని విడిపించే వరకూ మీ ప్రవర్తన ఇలాగే ఉండాలి.
\v 3 ఇంతే కాక దేవుడు మీపై ఒలకబోసిన దయను మీరు అనుభవించారు కాబట్టి మీరిలా ఉండండి.
\s5
\p
\v 4 ఏదైనా కట్టడానికి పునాదిరాయి అత్యంత కీలకమైనట్లే మానవాళికి ప్రభువైన యేసు కూడా అలాంటి వాడే. అయితే ఆయన పునాది రాయిలాగా జీవం లేనివాడు కాడు. ఆయనలో జీవం ఉంది. అనేకులు తిరస్కరించినా దేవుడు ఎన్నుకున్నది ఆయననే, అమూల్యంగా ఎంచిందీ ఆయననే.
\v 5 ఇల్లు కట్టడానికి మనుషులు వాడే రాళ్ళలాగా దేవుని ఆత్మ నివసించేలా దేవుడు నిర్మిస్తున్న ఆధ్యాత్మిక గృహానికి దేవుడు వాడే సజీవమైన రాళ్లలాగా మీరున్నారు. ఆయన ఇలా చేయడం వల్ల, మీ కొరకు మరణించిన యేసు క్రీస్తు ద్వారా దేవుడు ఆమోదించే ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి దైవపీఠం దగ్గర పరిశుద్ధ యాజకులుగా ఉండగలరు.
\s5
\v 6 ఎందుకంటే లేఖనంలో ఇలా రాసి ఉంది,
\q1 "నేను యెరూషలేములో ఒక వ్యక్తిని మూల రాయిగా నియమిస్తున్నాను.
\q1 ఆ రాయి విలువైనదీ ఎన్నిక అయినదీ ప్రాముఖ్యమైనదీ.
\q1 ఆయనను నమ్మేవారెవరూ సిగ్గు పడరు."
\s5
\p
\v 7 కాబట్టి యేసును విశ్వసిస్తున్న మీకు దేవుని దగ్గర దొరికే గౌరవం ఇది. అయితే యేసును విశ్వసించనివారికి ఆయన ఎలాంటి వాడంటే,
\q1 "ఇల్లు కట్టే వారు నిరాకరించిన రాయి, మూలకు తలరాయి అయింది."
\p
\v 8 లేఖనాలలో ఇంకా ఆయన గురించి,
\q "ఆయన వారికి ఒక అడ్డురాయి లాగా ఉన్నాడు, వారు తొట్రుపడుతున్నారు.
\q ఆయన వారికి ఒక అడ్డుబండ లాగా ఉన్నాడు, వారు తడబడి జారి పడుతున్నారు.
\q రాయి తగిలి పడి గాయపడ్డట్టు ఉన్నారు.
\q దేవుని సందేశానికి అవిధేయులైనవారు తమని తాము గాయ పరుచుకుంటారు.
\q వారికి ఇలా జరుగుతుందని దేవుడు నిశ్చయించాడు."
\s5
\p
\v 9 మిమ్మల్నైతే తనవారిగా దేవుడు ఎన్నుకున్నాడు. మీరు దేవుణ్ణి ఆరాధించే అర్చకుల సమూహంలా ఉన్నారు. అంతేకాదు, రాజుల్లా దేవుడితో ఉండి పాలిస్తారు కూడా. మీరు దేవుని సొంత జన సమూహం. అందువలన ఆయన చేసిన అద్భుతమైన కార్యాలను ఎలుగెత్తి చాటగలుగుతారు. దేవుని సత్యమెరుగని చీకటిలోనుంచి, ఇంతకు మునుపు మీరు సంచరించిన మార్గాల్లోంచి ఆయన మిమ్మల్ని వెలుపలికి పిలిచాడు. తనను గూర్చిన ఆశ్చర్యకరమైన సత్యాలను మీరు గ్రహించగలిగేలా చేశాడు.
\p
\v 10 మీగురించి లేఖనాలు చెప్పిన సత్యమేంటంటే,
\q "ఒకప్పుడు మీరు ప్రత్యేకమైన జన సమూహం కాదు.
\q ఇప్పుడైతే మీరు దేవుని ప్రజలు.
\q పూర్వం మీరు దేవుని కనికరానికి నోచుకోలేదు.
\q అయితే ఇప్పుడు ఆయన కనికరం పొందారు."
\s5
\p
\v 11 నా ప్రియులారా, పరలోకమే మీ స్వస్థలం, ఇక్కడ మీరు పరదేశులే. అందువలన అలవాటుగా నెరవేర్చుకుంటున్న శరీర దురాశలన్నింటినీ మానవలసిందే. అవే జరిగితే దేవునితో గల చక్కటి సహవాసాన్ని కోల్పోతారు.
\v 12 దేవుణ్ణి ఎరగని వారి మధ్య మంచి ప్రవర్తన కలిగి ఉండండి. అయినప్పటికీ వారు మిమ్మల్ని దుర్మార్గులని దూషిస్తూ ఉన్నా, మీరు మానక చేసే మంచి పనులు చూసి, దేవుడు అందరికీ తీర్పు తీర్చే రోజున ఆయనను మహిమ పరుస్తారు.
\s5
\p
\v 13 ప్రభువైన యేసును ఘనపరచాలని కోరుకుంటున్న మీరు న్యాయమైన ప్రతి అధికారికీ లోబడి ఉండండి. వాళ్లందరిలో ముఖ్యంగా రాజ్య పాలకులకు విస్తృతమైన అధికారాలు ఉన్నాయని గమనించండి.
\v 14 ఏలిక అందరికీ అధిపతి అని, అధికారులు దుర్మార్గుల్ని శిక్షించడానికీ, మంచి వారిని మెచ్చుకోడానికీ దేవుడు పంపిన వాళ్ళనీ గ్రహించి వాళ్ళకి లోబడి ఉండండి.
\v 15 ఎందుకంటే మీరు ఈ విధంగా మంచి చేస్తూ తెలివి తక్కువగా మాట్లాడే బుద్ధిహీనుల నోరు మూయించడం దేవుని చిత్తం.
\v 16 యజమాని బానిసత్వం నుండి స్వేచ్ఛ పొందిన వాళ్ళుగా ప్రవర్తించండి. అలాగని దుర్మార్గాన్ని కప్పి పెట్టడానికి మీ స్వేచ్ఛను వినియోగించక, దేవుని సేవకులుగా ఉండండి.
\v 17 అందరినీ గౌరవించండి. తోటి సోదరుల్ని ప్రేమించండి, దేవునికి భయపడండి, పరిపాలిస్తున్న వాళ్ళని గౌరవించండి.
\s5
\p
\v 18 సేవకులారా, మంచివాళ్ళూ సాత్వికులయిన యజమానులకు మాత్రమే కాక వక్ర బుద్ధి గల వాళ్ళకీ, మీతో కరుకుగా వుండే వారికి కూడా పూర్తి మర్యాదతో లోబడి ఉండండి.
\v 19 మీరు దేవుని గురించిన మనస్సాక్షిని బట్టి అన్యాయాన్ని అనుభవిస్తూ బాధ సహిస్తుంటే అది గొప్ప విషయం. అలా ప్రవర్తించడం మీకు తగినదే. దేవుడు మీ విషయంలో సంతోషిస్తాడు.
\v 20 మీరు పాపం చేసి శిక్ష అనుభవిస్తూ సహిస్తుంటే అదేమి గొప్ప? దేవుడు అలాంటి వాళ్ళ విషయంలో ఏమాత్రం సంతోషించడు. మేలు చేసి బాధలకు గురి అయి కూడా సహిస్తుంటే అది దేవుని దృష్టిలో మంచిది, ఆయన మెచ్చుకుంటాడు.
\s5
\v 21 మీకోసం శ్రమపడిన క్రీస్తు మనస్సు మీకుండాలనే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. క్రీస్తు కూడా మీకోసం బాధపడి, మీరు తన అడుగు జాడల్లో నడవాలని మీకు ఒక ఆదర్శాన్ని చూపాడు.
\v 22 క్రీస్తు నడిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోండి,
\q1 ఆయన ఎలాంటి పాపం చేయలేదు.
\q1 ఆయన నోటిలో ఎలాంటి కపటమూ కనబడలేదు.
\q1
\v 23 ఆయనను దూషించినా తిరిగి దూషించ లేదు.
\q1 ఆయన బాధపడినా తిరిగి బెదిరింపక, న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు.
\q1 తన నిర్దోషిత్వాన్ని దేవుడే రుజువు చేస్తాడని నిర్ణయించుకున్నాడు.
\s5
\q1
\v 24 ఇక మనం పాపం చేయడం మానివేసి, నీతి కోసం బతకడానికి,
\q1 స్వయంగా ఆయనే తన దేహంలో మన పాపాలను మాను మీద భరించాడు.
\q1 ఆయన పొందిన గాయాల వలన మీరు బాగుపడ్డారు.
\p
\v 25 మీరు తప్పిపోయిన గొర్రెల్లాగా తిరుగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీ కాపరి, మీ ఆత్మల సంరక్షకుడు అయిన యేసు దగ్గరికి తిరిగి వచ్చారు. కాపరి తన గొర్రెలను జాగ్రత్తగా కాపు కాసినట్టు మిమ్మల్ని భద్రం చేస్తాడు.
\s5
\c 3
\p
\v 1 విశ్వాసులైన స్త్రీలారా, మీరు మీ భర్తలకు తప్పకుండా లోబడాలి. అందువలన వాళ్ళలో ఎవరైనా వాక్యానికి అవిధేయులయినా, అసలు క్రీస్తు సువార్తను విశ్వసించకపోయినా సరే, మాటలతో కాకుండా, వాళ్ళ భార్యల ప్రవర్తనే వాళ్ళని ప్రభువు కోసం సంపాదిస్తుంది.
\v 2 ఎందుకంటే వాళ్ళకి మీరిచ్చే గౌరవాన్ని, మీ పవిత్ర ప్రవర్తన వాళ్ళు గమనిస్తారు.
\s5
\p
\v 3 అంతేకానీ పై పైనే కనపడేలా ఆడంబరంగా బంగారు ఆభరణాలు ధరించడం, ఖరీదైన బట్టలు వేసుకోవడం, చిత్రమైన జడలు అల్లుకోవడం లాంటి బాహ్య అలంకారాలు మీకు వద్దు.
\v 4 వాటికి బదులు ఎప్పటికీ వెలిసిపోని సుందరమైన అలంకరణలతో మీ అంతరంగాన్ని అలంకరించుకోండి. నా ఉద్దేశ్యం ఏంటంటే హృదయంలో శాంతం, సాత్విక స్వభావం కలిగి ఉండండి. ఇలాంటి అలంకారం నాశనం కాదు. దేవుని దృష్టిలో ఇవి చాలా విలువైనవి.
\s5
\v 5 పూర్వకాలంలో దేవుని మీద నమ్మకం ఉంచి ఆయనను ఘన పరచిన స్త్రీలు ఈ విధమైన పవిత్రతతో అలంకరించుకున్నారు. వారు దేవుణ్ణి నమ్మి తమ భర్తలకు లోబడి ఉంటూ తమ్మును తాము అలంకరించుకున్నారు.
\v 6 ఈ ప్రకారమే శారా అబ్రాహామును యజమాని అని పిలుస్తూ అతనికి లోబడి ఉంది. మీ భర్తలైనా మరెవరైనా గానీ వాళ్ళ ప్రవర్తన మీకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ భయపడకండి. న్యాయం చేయండి, మేలు తలపెట్టండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా శారా కుమార్తెలుగా భావిస్తాడు.
\s5
\p
\v 7 విశ్వాసులైన భర్తలారా, మీ భార్యలు మీకు విధేయులై ఉన్నట్టే మీ నడవడి వాళ్ళకి తగినట్టు ఉండాలి. సాధారణంగా వాళ్ళు మీకంటే బలహీనులని గుర్తుంచుకుని మర్యాద మన్ననలతో వారిని చూసుకోండి. మీకిచ్చినట్టే వాళ్ళకి కూడా దేవుడు నిత్య జీవం ప్రసాదించాడు. ఇలా చేస్తే మీ ప్రార్థనలకు ఎలాటి ఆటంకం కలగదు.
\s5
\p
\v 8 చివరిగా మీ అందరి గురించీ ఒక్కమాట, ఒకరినొకరు ఒప్పుకుంటూ మీ ఆలోచనలలో ఏకభావానికి రండి. ఒకరికొకరు దయగా ఉండండి, కరుణ చూపించుకోండి. ఒకే కుటుంబంలోని వ్యక్తుల్లాగా కలిసి మెలిసి ప్రేమను పంచుకోండి.
\v 9 మనుషులు మీకు కీడు తలపెట్టినా, అవమానించినా ఎలాటి ప్రతికార ధోరణి ప్రదర్శించకండి. డానికి బదులు వాళ్ళకి మేలు చేయమని దేవుణ్ణి వేడుకోండి. ఎందుకంటే మీరు ఇలా ఉండాలనే దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు ఆయన మీకు తోడుగా ఉంటాడు.
\s5
\v 10 మన జీవిత విధానాన్ని గురించి కీర్తనకారుడు రాసింది ఒకసారి చూస్తే,
\q "జీవితాన్ని ప్రేమతో చక్కగా అనుభవించాలనీ, మంచి రోజులు చూడాలనీ కోరే వాళ్ళు,
\q చెడు మాటలు పలకకుండా తమ నాలుకనూ మోసపు మాటలు చెప్పకుండా తన పెదవులనూ కాచుకోవాలి.
\q
\v 11 వారు చెడు పూర్తిగా మాని మేలే చేయాలి.
\q శాంతిని వెతికి అనుసరించాలి, అందరి శాంతి కోసం విజ్ఞప్తి చేయాలి.
\q
\v 12 ప్రభువు కళ్ళు నీతిమంతుల మీద ఉన్నాయి. వాళ్ళు చేస్తున్న వాటిని ఆయన అంగీకరిస్తున్నాడు.
\q ఆయన చెవులు వాళ్ళ ప్రార్థనలను వింటాయి. ఆయన వాళ్ళకి బదులిస్తాడు కూడా.
\q అయితే ప్రభువు ముఖం చెడు చేసే వాళ్ళకి విరోధంగా ఉంది."
\s5
\p
\v 13 మీరు ఎంత కష్టమైనా మంచే చేయాలి అనుకుని మంచి పనులు చేస్తూ ఉంటే మీకు హాని చేసే వాడెవడు?
\v 14 మీరొకవేళ నీతి జరిగించడం కోసం బాధలు అనుభవించినా మీరు ధన్యులే. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మిగతావాళ్ళు భయపడే వాటికి మీరు భయపడవద్దు. కలవరపడవద్దు. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని కష్టపెట్టినా ఇబ్బంది అనుకోవద్దు.
\s5
\v 15 దానికి బదులు మీ హృదయాల్లో మీరు ప్రేమించే క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. దేవుడు మీ నిమిత్తం ఏం చేస్తాడు, ఆయన నుంచి నమ్మకంతో ఎదురు చూస్తున్నది ఏంటి, ఆయననుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? అని ఎవరు అడిగినా సమాధానమివ్వడానికి సిద్ధంగా ఉండండి. చెప్తున్నప్పుడు గౌరవప్రదంగా నమ్రతగా చెప్పండి.
\p
\v 16 మీ వల్ల ఏ తప్పూ జరక్కుండా జాగ్రత్త పడండి. క్రీస్తుతో సహవాసం చేస్తున్న దానిని బట్టి మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకుంటూ మంచి చేస్తున్నప్పుడు, అది చూసిన మీ విరోధులు బహుశా సిగ్గుతో తల దించుకుంటారు.
\v 17 దేవుడే మీరు హింస పొందడాన్ని అనుమతించాడేమో. అలాగైతే, మంచి పనులు చేయడంలో మీకు ఎలాంటి కష్టాలు ఎదురైనప్పటికీ మానక మంచే చేయండి.
\s5
\p
\v 18 మానవాళి పాపాల నిమిత్తం క్రీస్తు ఒక్కసారే చనిపోయాడు. ఆయన ధర్మాత్ముడై ఉండి ధర్మ విహీనులకోసం చనిపోయాడు. మనల్ని దేవుని చెంతకు చేర్చడానికి ఆయన మరణించాడు. మనలాంటి శరీరంతోనే ఆయన మన మధ్యలో జీవిస్తున్నప్పుడు ఆయనను చంపేశారు. కానీ దేవుని ఆత్మ ఆయనను బతికించాడు.
\p
\v 19 దేవుడు చెరలో ఉంచిన చెడ్డ ఆత్మలకి సయితం దేవుని విజయాన్నిఆయన ప్రకటించేలా ఆత్మ సాధ్యం చేశాడు.
\v 20 పూర్వం నోవహు రోజుల్లో పెద్ద ఓడనొకదాన్ని దేవుడు నోవహుతో తయారు చేయిస్తున్నప్పుడు ప్రజలంతా వాళ్ళ చెడు ప్రవర్తన నుండి తన వైపుకు తిరుగుతారేమో అని దేవుడు సహనంతో ఎదురు చూశాడు. అయినా ఈ దుష్ట ఆత్మలు ఆయనకు అవిధేయులయ్యారు. ఆ ఓడ ద్వారా కొద్దిమందే రక్షణ పొందారు. అన్నివైపులా భూమిని వరద ముంచెత్తినపుడు విశేషించి, ఎనిమిది మందిని మాత్రమే దేవుడు ఆ జల వాహినిలోనుంచి క్షేమంగా పైకి తీసుకొచ్చాడు. మిగతా వాళ్ళందరూ మునిగిపోయారు.
\s5
\p
\v 21 ఆ నీళ్ళు ఇప్పుడు మనం తీసుకున్న బాప్తీసాన్ని సూచిస్తూ ఉన్నాయి. అంతేకాక యేసు క్రీస్తును మరణం నుండి లేపడం వలన ఈ నీళ్ళ ద్వారా దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఈ నీళ్ళు మన శరీరానికున్న మలినాన్ని తొలగించడానికి కాదు, మనలో పాపం వలన కలిగిన అపరాధ భావాన్ని దేవుడు సమూలంగా తొలగించాడని మనం నమ్మేలా ఆయన్ను వేడుకుంటున్నామన్నమాట.
\v 22 దూతలూ, అధికారులూ, శక్తులూ, అవి చెడ్డవైనా మంచివైనా అన్నీ దేవుడు ఆయనకు లోబరచగా క్రీస్తు ఇక్కడనుండి వెళ్లి పరలోకంలో తండ్రి పక్కన అత్యున్నత స్థానం నుండి ప్రభుత్వం చేస్తున్నాడు.
\s5
\c 4
\p
\v 1 క్రీస్తు శరీరంతో ఉండగా హింసలు పొందాడు కాబట్టి మీరు కూడా హింస పొందడానికి సమ్మతించండి. ఇలా శరీరాలను హింసకు అప్పగించిన వాళ్ళు పాపం చేయడం మానేస్తారు.
\v 2 దాని పర్యవసానంగా తమ శేష జీవితాన్ని ఇక మీదట చెడిపోయిన మానవ కోరికలను అనుసరించక, దేవుని ఇష్టం కోసమే ఆయన చెయ్యమన్న పనులు చేస్తూ జీవిస్తారు.
\s5
\v 3 దేవుణ్ణి ఎరగని వాళ్ళు తమ ఇష్టానుసారంగా జీవించినట్టు మీరు కూడా ఇప్పటికే ఈ లోకంలో చాలా విలువైన మీ సమయాన్ని అలాగే గడిపేశారు. గతంలో మీరు లైంగిక పరమైన అనైతిక కార్యాలు చేశారు. మద్యపానం చేస్తూ అల్లరి చిల్లరి వినోదాలూ, విచ్చలవిడి విందులలో మునిగి తేలారు. దేవుడు అసహ్యించుకునే విగ్రహ పూజలు సైతం చేశారు.
\v 4 అప్పుడు మీతోపాటు ఇలాంటి వాటిల్లో పాలు పంచుకున్న మీ మిత్రులు, మీరిప్పుడు వాళ్ళతో అలాంటి విషయాలలో కలవకపోవడాన్ని చూసి వాళ్ళకి ఆశ్చర్యమేసింది. పర్యవసానంగా వాళ్ళు మిమ్మల్ని దూషిస్తారు.
\p
\v 5 కానీ ఒకరోజు వాళ్ళు చేసిందంతా దేవుని ముందు ఒప్పుకుని తీరాల్సిందే. ఆయనే వాళ్ళకి తీర్పు తీర్చేవాడు.
\v 6 అందుకే చనిపోయిన వాళ్ళు మానవ రీతిగా వాళ్ళ శరీరానికి తీర్పు జరిగినా వాళ్ళు పరిశుద్దాత్ముని శక్తితో తిరిగి దేవునిలో నిత్యం జీవించేలా వాళ్ళకి కూడా క్రీస్తు సువార్తను ప్రకటించాడు.
\s5
\v 7 ఈ భూమి మీద అన్నిటికీ అంతం అతి త్వరలో సమీపించనైయుంది. కాబట్టి మెలకువ కలిగి తెలివిగా ఆలోచించండి, మీ ఆలోచనలను మీ అధీనంలో ఉంచుకోండి. అప్పుడే మీరు చక్కగా ప్రార్థన చేయగలుగుతారు.
\v 8 అన్నిటి కంటే ప్రధానంగా ఒకరిపట్ల ఒకరు గాఢమైన ప్రేమతో ఉండండి. ఎందుకంటే, ప్రేమిస్తే ఎదుటివాళ్ళ తప్పుల్ని అంతగా ఎంచము. ప్రేమ ఇతరుల పాపాలను వెతికి పట్టుకోడానికి ప్రయత్నించదు.
\v 9 ప్రయాణిస్తూ మీ మధ్యకు వచ్చిన క్రైస్తవులు భోజనం చేసి విశ్రమించడానికి వీలుగా సదుపాయం కల్పించండి. ఏ మాత్రమూ సణుక్కోకుండా అతిథి మర్యాదలు చేయండి.
\s5
\v 10 విశ్వాసులందరూ తమకి దేవుడు అనుగ్రహించిన కృపావరాలను ఇతరుల సేవ కోసం వినియోగించాలి. దేవుడు ప్రేమించి తమకిచ్చిన వివిధమైన ఈ కృపావరాల నిర్వహణ విషయంలో ప్రతి విశ్వాసీ జాగ్రత్తగా ఉండాలి.
\v 11 దేవుడు తమకిచ్చిన వరాన్నిబట్టి విశ్వాసుల సభలో బోధిస్తున్నవాళ్ళు ఆ మాటలు తమవి కాదు, దేవుని మాటలే అని జాగ్రత్తగా మాట్లాడాలి. దయగలిగి ఇతరులకు సేవ చేస్తున్నవాళ్ళు దేవుడిస్తున్న శక్తితో ఆ పనులు చేయాలి, మాకు ఈ సామర్ధ్యం కలుగజేసినవాడు యేసు క్రీస్తే అని దేవుణ్ణి ఘనపరిచేలా మీ ప్రవర్తన ఉండాలి. మనందరం దేవుణ్ణి స్తుతించాలి, ఎందుకంటే ప్రతిదీ నిత్యమూ ఆయనకి లొంగి ఉండేలా సంపూర్ణాధికారం ఆయనకి ఉంది. ఆమేన్.
\s5
\p
\v 12 నా ప్రియులారా, మీరు క్రీస్తు సంబంధులైన కారణంగా మిమ్మల్ని కష్టపెడుతున్న సంగతులూ , అవస్థల పాలు చేస్తున్న విషయాలూ చూసి ఆశ్చర్యపడకండి. మనుషులు రకరకాల లోహాలను పరీక్షించడానికి వాటిని అగ్నిలో వేస్తున్నట్టు, మీకు సంభవిస్తున్న హింసలు కూడా మిమ్మల్ని పరీక్షిస్తున్నాయి. అంతేకానీ మీకేదో వింత సంభవిస్తున్నట్టు ఆశ్చర్యపోవద్దు.
\v 13 అందుకు బదులుగా క్రీస్తుకు సంభవించి, ఆయన సహిస్తూ వచ్చిన అలాంటి సంగతులే మీకు కూడా ఎదురౌతున్నాయని గ్రహించి హింసల్లో ఆనందించండి. క్రీస్తు తిరిగి వచ్చి తానెంతటి మహిమ గలవాడో అందరికీ తెలియచేస్తున్నప్పుడు మీరు ఆనందించగలిగేలా ఇప్పటి హింసల్లో సంతోషించండి.
\p
\v 14 క్రీస్తును నమ్మి స్థిరంగా నిలబడినందుకు మిమ్మల్ని ఎవరైనా అవమానించినా, తిరస్కరించినా దేవుడు మిమ్మల్ని సంతోషంగా అక్కున చేర్చుకుంటాడు. ఎందుకంటే దేవుడు ఎంత ఘనమైనవాడో వెల్లడించే దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు. అలాంటి జీవితం దేవుని ఆత్మను చూపిస్తుంది.
\s5
\v 15 మిమ్మల్ని కష్టాల పాలుజేసిన కారణాలు మీరు ఎవరినైనా హత్య చేయడమో, దేనినైనా దొంగిలించడమో, ఏదో ఒక చెడ్డపని చేయడమో, పరాయివాళ్ళ విషయాలలో జోక్యం చేసుకోవడమో కాకూడదు.
\v 16 మీరు క్రైస్తవులైనందువల్ల హింసల పాలైతే వాటి నిమిత్తం సిగ్గుపడకండి. దానికి మించి ఆనందించండి, క్రీస్తుకు చెందిన వారమైనందుకు దేవుణ్ణి స్తుతించండి.
\s5
\p
\v 17 ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మానవాళికి దేవుడు తీర్పు తీర్చే సమయం ఇప్పుడు ఆసన్నమయ్యింది. ఆయన మొదటగా విచారణ తన సొంతవాళ్ళతోనే మొదలు పెట్టబోతున్నాడు. కాబట్టి విశ్వాసులమైన మనల్నే మొదటగా విచారణకు నిలబెడుతున్నాడంటే ఇక ఆయన పంపిన సువార్తను తిరస్కరించిన వాళ్ళ గతి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించండి!
\v 18 పవిత్ర లేఖనాలలో ఇదే విషయం ఉంది.
\q "నీతిమంతులు అనేకులు పరలోకం చేరక ముందే వ్యయ ప్రయాసలతో కూడిన అనేక పరీక్షలకు లోనౌతారు.
\q భక్తి హీనులూ, పాపులూ మరింత నిశ్చయంగా తీవ్రమైన శిక్షకు, దేవుని దండనకూ గురౌతారు" అని రాసి ఉంది.
\p
\v 19 కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడే వాళ్ళు దేవుడే తమ క్షేమాన్ని చూసుకుంటాడనీ, ఆయన ఆడిన మాట తప్పడని తమ సృష్టికర్త అని నమ్మి, మానక మేలు చేస్తూ జీవించాలి.
\s5
\c 5
\p
\v 1 విశ్వాసుల సంఘాలను నడిపిస్తున్న మీలోని పెద్దలకు నేను చెప్పేది ఏంటంటే, నేను కూడా ఒక పెద్దనే. క్రీస్తు హింసలు పొందగా చూసిన వాళ్ళలో నేనూ ఒకణ్ణి. పరలోకం లోని క్రీస్తు మహిమలో కొంత నేనూ పాలివాడినే.
\v 2 సంఘంలోని విశ్వాసుల క్షేమాన్ని జాగ్రత్తగా పట్టించుకోమని పెద్దలకు నా మనవి. గొర్రెల సంరక్షణను జాగ్రత్తగా నిర్వర్తించే కాపరుల లాంటివాళ్ళే మీరు కూడా. ఇలాంటి పనిని ఏదో బలవంతంగానో, మొక్కుబడిగానో చేయొద్దు. దేవుడు ఆశించిన విధంగా ఇష్టపడి చేయండి. పట్టుదలతో ఉత్చాహంగా చేయండి. అంతేగానీ డబ్బుకు ఆశపడి మాత్రం చేయకండి.
\p
\v 3 దేవుడు మీకప్పగించిన వాళ్ళ మీద యజమానుల్లాగా పెత్తనం చెలాయించకండి. మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ నడుస్తున్న మీ జీవిత విధానం వాళ్ళకొక చక్కని ఉదాహరణగా ఉండాలి.
\v 4 మన ప్రధాన కాపరి అయిన యేసు తిరిగి ప్రత్యక్షమైనపుడు మీరిలా చేస్తూ ఉంటే, మీలో ప్రతిఒక్కరికీ ఘనమైన పారితోషికం ఆయన అందిస్తాడు. అది పరుగు పందెంలో గెలిచిన వాళ్ళకి ఇచ్చే పతకం లాగా ఘనంగా ఉంటుంది. పైగా ఆ పతకం కొంత కాలానికి పాడై పోతుంది గానీ దేవుడిచ్చే పతకం నిత్యం నిలిచి ఉంటుంది.
\s5
\p
\v 5 చిన్నలారా, మీరు సంఘం లోని పెద్దలకు లోబడి ఉండండి. విశ్వాసులందరూ ఒకరికొకరు వినయ విధేయతలతో మెలగండి. ఎందుకంటే దేవుడు గర్విష్టులను తిరస్కరించి వినయం గలవాళ్ళ ఎడల దయగా ఉంటాడు.
\p
\v 6 కాబట్టి దేవుడు తన అధిక బలంతో గర్విష్టుల మదాన్ని అణచి వేస్తాడని తెలుసుకోండి. తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేలా ఆయన బలిష్ఠమైన చేతి కింద మిమ్మల్ని మీరే తగ్గించుకోండి.
\v 7 ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి మీ ఆందోళన అంతా ఆయన మీద వేయండి.
\s5
\p
\v 8 నిగ్రహంతో మెలకువగా ఉండండి. మీ శత్రువైన సాతాను గర్జించే సింహంలా ఎవరిని కబళించాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు.
\v 9 క్రీస్తు ఎడలా, ఆయన సువార్త ఎడలా ఉన్న మీ విశ్వాసాన్ని స్థిరంగా కొనసాగిస్తూ వాణ్ణి ఎదిరించండి. ప్రపంచమంతటా ఉన్న మీ సోదరులకు కూడా ఇలాంటి బాధలే కలుగుతున్నాయి.
\s5
\v 10 ఎలాంటి పరిస్థితులైనా దేవుడు పట్టించుకుంటాడు, దయతో చక్క దిద్దుతాడు. ఆయనతో ఐక్యమై ఆయనలో నిత్యం ఉండే పరలోక ప్రభావాన్ని పంచుకోవడానికి మనల్ని ఎంపిక చేసుకున్నవాడు ఆయనే. లోకం లోని వాళ్ళు మీకు చేస్తున్న హానిని బట్టి మీరిలా కొంత కాలం బాధలు అనుభవించినా తరువాత తానే మీ ఆత్మ సంబంధమైన కొరతలు తొలగించి, మిమ్మల్ని సరైన ఆత్మ స్థితిలోకి తెచ్చి, మీరు బలపడి విశ్వాసంతో ఆయనను వెంబడించేలా అన్నివిధాలుగా మిమ్మల్ని ఆదుకుంటాడు.
\v 11 ఆయన బలమైన అధికారం నిత్యమూ ఉండు గాక. ఆయనకే ప్రభావం శాశ్వతంగా కలుగు గాక, ఆమేన్‌.
\s5
\p
\v 12 నేను చెబుతుండగా సిల్వాను ఈ లేఖ రాశాడు. అతణ్ణి నమ్మకమైన నా తోటి సహోదరుడుగా నేను ఎంచాను. దేవుడు ప్రీతిగా మన నిమిత్తం చేస్తున్న, మనం యోగ్యులం కాకపోయినా ఆయన ఇస్తున్న విషయాలన్ని క్రోడీకరించి మిమ్మల్ని ధైర్యపరిచేలా రాసిన ఈ చిన్ని ఉత్తరంలోని సమాచారమంతా కచ్చితంగా యధార్ధమే. దీనిలో నిలకడగా ఉండండి.
\p
\v 13 దేవుడు మిమ్మల్ని ఎంపిక చేసుకున్నట్టే, అప్పుడప్పుడూ మనం బబులోను అని పిలుస్తున్న ఈ పట్టణంలో కూడా దేవునిచేతా దేవుని కోసం దేవుని ప్రజగా ఎంపికైన వాళ్ళు మీకు అభినందనలు చెబుతున్నారు. నా కొడుకు లాంటి మార్కు కూడా మీకు అభినందనలు చెబుతున్నాడు.
\v 14 ప్రేమ ముద్దుతో ఒకరికొకరు అభినందనలు చెప్పుకోండి. క్రీస్తును చేరిన మీకందరికీ ఆయన శాంతి దయచేయు గాక.