STR_te_iev/52-COL.usfm

184 lines
43 KiB
Plaintext

\id COL - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h కొలస్సయులకు రాసిన పత్రిక
\toc1 కొలస్సయులకు రాసిన పత్రిక
\toc2 కొలస్సయులకు రాసిన పత్రిక
\toc3 col
\mt1 కొలస్సయులకు రాసిన పత్రిక
\s5
\c 1
\p
\v 1 కొలస్సై పట్టణంలో ఉన్న ప్రియమైన నా తోటి విశ్వాసులకు పౌలు అనే నేను రాస్తున్నాను. దేవుని సంకల్పం ప్రకారం యేసు క్రీస్తుకు అపొస్తలుడైన పౌలు, క్రీస్తులో విశ్వాసముంచిన మన సోదరుడు తిమోతీ ఇద్దరం కలిసి ఈ ఉత్తరం మీకు పంపుతున్నాము.
\v 2 దేవుని కోసం ప్రత్యేకించబడిన వారికీ క్రీస్తులో విశ్వాసముంచిన సోదరులకూ ఈ ఉత్తరం పంపుతున్నాము. మన తండ్రి అయిన దేవుని నుండి కృపా శాంతీ మీకు కలుగు గాక!
\p
\v 3 మేము మీ గురించి ప్రార్థన చేసే ప్రతిసారీ మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం.
\s5
\v 4 మీరు క్రీస్తు యేసుపై నిలిపిన విశ్వాసాన్ని గురించీ పరిశుద్ధులందరి పట్ల మీరు చూపుతున్న ప్రేమను గురించీ మేము విని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం.
\v 5 పరలోకంలో దేవుడు మీకోసం భద్రంగా ఉంచిన కచ్చితమైన సంగతుల కోసం మీరు మీ తోటి విశ్వాసులను ప్రేమిస్తున్నారు. క్రీస్తు గురించిన నిజమైన సువార్త విన్నప్పుడు ఈ నిరీక్షణను గురించి మొదటిసారి మీరు విన్నారు.
\p
\v 6 కొలస్సై లో మీరు విన్న సువార్తను విశ్వాసులు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రకటిస్తున్నారు. ఇది మీరు విన్న మొదటి రోజు నుండే మీలో ఎలా పని చేసిందో అలానే జరిగింది. దేవుడు నిజంగా ఎంత దయగలవాడో మనకు అర్థం అయ్యింది. ఈ సువార్త బాగా ఎదుగుతున్న పొలం లోని పైరు వంటిది. అది పుష్కలంగా పంటనిస్తుంది.
\s5
\p
\v 7 ఎపఫ్రా మీకు ఈ సువార్తను బోధించాడు. అతన్ని మేము ప్రేమిస్తాము. ఎందుకంటే అతడు మాతోబాటు క్రీస్తుసేవ చేసాడు. ఇంకా మాకు బదులుగా ఆయనకు నమ్మకంతో పనిచేస్తున్నాడు.
\v 8 మీరు దేవుని ఆత్మతో నిండి దేవుణ్ణి, దేవుని ప్రజలను ఇతరులను కూడా ప్రేమిస్తున్నారని అతడు మాకు తెలియచేసాడు.
\s5
\p
\v 9 మీ ప్రేమ గురించి మేం విన్న రోజు నుండీ మేము మీకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు చేయాలనుకున్న ప్రతిదాన్నీ మీకు చూపించమనీ దేవుని ఆత్మ బోధించే దానిని మీరు అర్థం చేసుకొనేలా మీకు సంపూర్ణ జ్ఞానం ఇవ్వాలనీ మేము దేవుణ్ణి అడుగుతున్నాము.
\v 10 ఇతరులు దేవుణ్ణి గౌరవించడానికి సహాయపడేలా మీరు జీవించాలని మేము ప్రార్ధిస్తున్నాం. అప్పుడు దేవుడు మీ విషయంలో సంతోషపడతాడు. దేవుణ్ణి మరి ఎక్కువగా మీరు అర్థం చేసుకోవాలనీ ఆయన చేయమని చెప్పిన మంచి పనులన్నిటినీ మీరు చేయాలనీ మేము ప్రార్ధిస్తున్నాం.
\s5
\v 11 మహిమ ప్రభావాలతో కూడిన ఆయన శక్తి మిమ్మల్ని బలపరచాలనీ దాంతో ప్రతి కష్టాన్నీ మీరు సహనంతో భరించగలిగేలా మీ గురించి దేవుణ్ణి వేడుకుంటున్నాం.
\v 12 తనకోసం ప్రత్యేకించబడిన వారి వారసత్వంలో భాగం పంచుకోడానికి మనలను అర్హులుగా చేసిన తండ్రికి మీరు సంతోషంతో కృతజ్ఞతలు చెల్లించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. మీరు ఆయన వెలుగు సన్నిధిలో ఉన్నప్పుడు మీ కోసం దాచి ఉంచిన వాటన్నిటినీ మీకు ఇవ్వాలని కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం.
\s5
\p
\v 13 తండ్రి అయిన దేవుడు మనలను చీకటి రాజ్యపు ఆధిపత్యం నుండి రక్షించి తన ప్రియ కుమారుడు మనలను పరిపాలించేలా చేసాడు.
\v 14 ఆయన కుమారుని ద్వారానే మనల్ని ఆ చెడు నుండి విడిపించి మన పాపాలను క్షమించాడు.
\s5
\v 15 దేవుణ్ణి మనం చూడకపోయినా ఎప్పుడైతే ఆ కుమారుడి గురించి తెలుసుకుంటామో అప్పుడే దేవుణ్ణి గురించి కూడా తెలుసుకోగలుగుతాము.
\v 16 తండ్రి కోరుకున్నట్టు కుమారుడు అన్నీ సృష్టించాడు. ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్నవన్నీ కంటికి కనిపించేదైనా, కనిపించని అన్ని రకాల దేవదూతలైనా, సింహాసనాలైనా, ఆధిపత్యాలైనా, ప్రభుత్వాలైనా, అధికారులైనా, సర్వమూ తండ్రి కోరుకున్నట్టుగా కుమారుడే అన్నీ సృష్టించాడు. అవి అన్నీ ఆయన కోసమే కలిగాయి.
\v 17 ఆయన ఇవేవీ ఉనికిలో లేనప్పుడే ఉన్నాడు. అన్నిటినీ ఆయనే ఒడిసి పట్టుకున్నాడు, అన్నిటికీ ఆధారం ఆయనే.
\s5
\v 18 శరీరాన్ని తల ఎలా నడిపిస్తుందో అలాగే ఆయనే సంఘాన్నీ విశ్వాసులనూ నడిపిస్తాడు. ఆయనే సంఘాన్ని మొదలుపెట్టాడు కాబట్టి ఆయనే దానిని పాలిస్తాడు. చనిపోయి సజీవుడిగా పరిపూర్ణ దేహంతో ఆయన లేచినవారిలో ఆయనే ప్రథముడు. కాబట్టి ఆయనే ప్రతి విషయంలోనూ అధికుడు.
\v 19 తాను పరిపూర్ణంగా క్రీస్తులో నివసించి సమస్తాన్నీ చేయాలని తండ్రి అయిన దేవుడు ఎంతో ఇష్టపడ్డాడు.
\v 20 యేసు ద్వారా శాంతితో అన్నింటినీ తిరిగి తన దగ్గరకు తెచ్చుకోవాలని దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు భూమిమీద, పరలోకంలో ఉన్న అన్ని విషయాలకూ అందరు మనుష్యులకూ శాంతినివ్వాలని అనుకున్నాడు. ఆయన తన కుమారుడిని సిలువలో చనిపోవటానికి అర్పించి ఆయన కార్చిన రక్తం ద్వారా ఈ కార్యం చేశాడు.
\s5
\p
\v 21 మీరు క్రీస్తుని నమ్మకముందు దేవుడు మిమ్మల్ని శత్రువులుగా భావించాడు. మీ చెడు ఆలోచనల వల్లా మీ చెడు పనుల వల్లా మీరు కూడా దేవునికి పరాయివారుగా ఉన్నారు.
\v 22 కాని ఇప్పుడు దేవుడు ఆయనకు, మీకు మధ్య శాంతిని నెలకొల్పి మిమ్మల్ని తన స్నేహితులుగా మలుచుకున్నాడు. యేసు చనిపోవడం ద్వారా తన శరీరాన్ని తన జీవితాన్ని మనకోసం వదులుకున్నప్పుడు ఆయన ఇది చేసాడు. ఇలా చేయడం వల్ల మనం దేవునికి సంబంధించిన వాళ్ళం కావడానికి వీలు కలిగింది. అయితే ఇప్పుడు ఆయన మనలో ఏ తప్పూ కనుగొనలేడు, మనల్ని నిందించడానికి ఏమీ ఉండదు.
\v 23 కానీ ఇది జరగాలంటే మీరు విశ్వాసంలో సుస్థిరంగా నిలిచి ఉండాలి. అప్పుడు మీరు రాతి మీద కట్టిన ఇల్లులా దృఢంగా ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు విన్న సువార్తలో దేవుడు మీ కోసం చేస్తానని చెప్పిన వాగ్దానాలపై ఏ కారణాల వల్ల కూడా నమ్మకం కోల్పోవద్దు. ఈ సువార్తనే పౌలు అనే నేను ప్రజలకు ప్రకటిస్తూ దేవుణ్ణి సేవిస్తున్నాను.
\s5
\p
\v 24 ఇప్పుడు మీ ప్రయోజనం కోసం నేను బాధలు పడుతున్నందుకు సంతోషిస్తున్నాను. అవును. క్రీస్తు శరీరం లాంటి సంఘం కోసం సహాయం చేయడానికి ఇంకా జరగబోయే సంగతుల కోసం కూడా నేను బాధలు పడటానికి సిద్దంగా ఉన్నాను.
\v 25 దేవుడే నన్ను ఆయన సేవకుడిగా చేసుకున్నాడు. చేయటానికి ఒక ప్రత్యేకమైన పనిని నాకు ఇచ్చాడు. యూదేతర ప్రజలైన మీలాంటి వారికి దేవుని సంపూర్ణ సువార్తను ప్రకటించడమే ఆ పని.
\p
\v 26 పూర్వకాలం నుండి తరతరాలుగా దేవుడు ఈ సువార్త వెల్లడించలేదు. అయితే ఇప్పుడు దేవుడు ఈ మర్మాన్నితన కోసం ప్రత్యేకించబడిన వారి కోసం తెలియజేశాడు.
\v 27 ఈ ప్రజలకే అంటే యూదులకు, యూదేతరులైన మీకు ఈ అద్భుత రహస్యాన్ని చెప్పడానికి దేవుడు ప్రణాళిక వేసాడు. ఆ రహస్యం ఇదే, క్రీస్తు మీలో నివసిస్తాడు, దేవుని మహిమలో మీకు భాగస్వామ్యం కావాలని మీరు ఆశించేలా మిమ్మల్ని చేస్తాడు.
\s5
\v 28 ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఉండి, ఆయనను పూర్తిగా తెలుసుకుని ఆయనతో కలిసి ఉండాలని మేము జ్ఞానంతో ప్రతి ఒక్కరినీ క్రీస్తు గురించి హెచ్చరిస్తున్నాం, బోధిస్తున్నాం.
\v 29 క్రీస్తు నాకు శక్తినిస్తున్నందువల్ల ఈ పని నేను బలంగా చేస్తున్నాను.
\s5
\c 2
\p
\v 1 మీ కోసమూ, లవొదికయ పట్టణంలోని వారి కోసమూ, నన్ను చూడని వారందరి కోసమూ నేను సహాయం చేయటానికి నా శాయశక్తులా పని చేస్తున్నానని మీరు తెలుసుకోవాలి.
\v 2 ఎందుకంటే నేను వారిని ప్రోత్సహించాలనీ మీలో మీరు ఒకరికొకరు ప్రేమించుకోవాలనీ మీరందరూ కలిసికట్టుగా ఉండాలనీ ఇది చేస్తున్నాను. మీరందరూ దేవుని గూర్చిన రహస్య సత్యాన్ని నమ్మకంగా పూర్తిగా అర్థం చేసుకోవాలని నా కోరిక. ఆ సత్యం క్రీస్తే.
\v 3 దేవుడు ఏమి ఆలోచిస్తున్నాడో ఆయన ఎంత జ్ఞానవంతుడో అనేది మనం క్రీస్తు ద్వారానే తెలుసుకోగలం.
\s5
\p
\v 4 ఎవ్వరూ మిమ్మల్ని మోసం చేయకుండా ఉండాలని మీకు ఈ సంగతి చెబుతున్నాను.
\v 5 నేను భౌతికంగా మీకు దూరంగా ఉన్నా వాస్తవంగా మీతోనే ఉన్నట్టుగా మీ గురించి నేను ఆందోళన పడుతూనే ఉన్నాను. అయినా ఎవ్వరూ అడ్డగించలేని విధంగా మీరు క్రీస్తును వెంబడిస్తున్నారనీ విని వదలకుండా ఆయనపై మీరు చూపుతున్న బలమైన విశ్వాసాన్ని చూసి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను.
\s5
\p
\v 6 మీరు ప్రభువైన క్రీస్తు యేసుపై నమ్మకం ఉంచడం ద్వారా ఆయనను అంగీకరించిన విధంగానే ఆయనలో జీవిస్తూ ఉండండి.
\v 7 ఒక చెట్టు దాని వేళ్ళను భూమిలో లోతుగా ఎలా విస్తరింప చేస్తుందో అలాగే మీరు కూడా ప్రభువైన క్రీస్తు యేసుపై పూర్తిగా ఆధారపడండి. మనుషులు ఇళ్ళను గట్టి పునాదిపై ఎలా కట్టుకుంటారో అలానే మీరూ ఆయనను విశ్వసించడం నేర్చుకోండి. ఇంకా దేవునికి మీరు ఎప్పుడూ కృతజ్ఞతలు చెల్లించండి.
\s5
\p
\v 8 దేవుణ్ణి ఎలా గౌరవించాలో ఆ పద్ధతులు మనుషులు బోధించిన ప్రకారం మీరు పాటించాలి అని గానీ ఈ లోకంలోని వారు అనుసరించే వాటినే మీరు అనుసరించాలి అని గానీ చెప్పే వారిని మీరు నమ్మకండి. క్రీస్తుకే లోబడండి.
\v 9 ఎందుకంటే మనిషిగా వచ్చిన క్రీస్తు యేసే నిజమైన దేవుడు.
\s5
\p
\v 10 మీరు క్రీస్తులో చేరి ఉన్నందున మీకేది అవసరమో అన్నింటినీ దేవుడు మీకు ఇస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్క మనిషినీ ఆత్మనూ దేవదూతలనూ పరిపాలిస్తున్నాడు.
\v 11 ఇది దేవుడే నీకు సున్నతి చేసినట్టుగా ఉంది. కాని ఇది మనిషి శరీరం నుండి ఒక మాంసం ముక్కను కత్తిరించినట్టు కాదు. దానికి బదులుగా మీలో ఉన్న పాపపు శక్తిని యేసు తీసివేసినట్టే. ఈ సున్నతి అంటే క్రీస్తు మీ పాపపు స్వభావాన్ని జయించి దాన్ని మీలోనుండి తీసివేయడమే.
\p
\v 12 మీరు బాప్తిసం పొందారు కాబట్టి మనుషులు క్రీస్తుని సమాధి చేసినప్పుడు వారు మిమ్మల్ని కూడా ఆయనతో సమాధి చేసారని దేవుడు భావించాడు. క్రీస్తు మళ్ళీ సజీవంగా లేచాడు. ఆయన మిమ్మల్ని కూడా తిరిగి లేపుతాడని మీరు నమ్మినందువల్ల మిమ్మల్ని కూడా ఆయన సజీవులుగా లేపాడు.
\s5
\v 13 మీరు ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసినందువల్లా మీరు యూదులు కానందున ఆయనను ఆరాధించక పోవటం వల్లా దేవుడు మిమ్మల్ని మృతతుల్యులుగా చూసాడు. కాని ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మన పాపాలన్నీటినీ క్షమించాడు.
\v 14 మనం ఎంతో పాపం చేసాము కానీ దేవుడు మన పాపాలను క్షమించాడు. ఇది ఒక మనిషి తనకు అప్పు ఉన్న వాడిని క్షమించి వారు సంతకం చేసుకున్న అప్పు కాగితాలను చింపేసినట్టుగా ఉంటుంది. కాని దేవుడి విషయంలో చూస్తే మనం చేసిన పాపాలన్నీ రాసిన కాగితాలనూ మనం అతిక్రమించిన చట్టాలనూ అన్నిటినీ క్రీస్తు చనిపోయిన సిలువలో ఆయన వ్రేలాడదీసాడు.
\v 15 అంతేకాకుండా, దేవుడు ఈ లోక ప్రజలను పాలించే దురాత్మ జీవులను ఓడించాడు. ఆయన వారిని ఓడించాడని అందరికీ తెలియచేసాడు. ఖైదీలను వీధుల్లో ఊరేగింపుగా ఎలా తీసుకు పోతారో దేవుడు వారిని కూడా అలాగే చేశాడు.
\s5
\p
\v 16 కాబట్టి తినే విషయంలోనూ తాగే విషయంలోనూ పండగ రోజులూ, అమావాస్య, విశ్రాంతి దినం వంటి విషయాల్లోనూ దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు అని ఎవరైనా అంటే మీరు పట్టించుకోకండి.
\v 17 ఈలాంటి నియమాలు, సంఘటనలు నిజంగా రాబోతున్న వాటికి నీడల్లాంటివి. ఆ రాబోతున్నవాడు క్రీస్తే.
\s5
\v 18 అలాంటి మనుష్యులే వినయాన్ని నటిస్తూ ఉంటారు. ఇంకా దేవతలను పూజించటం వారికి ఇష్టం. అలాగే చేయమని వారు మిమ్మల్ని బలవంతం చేస్తే లొంగకండి. మీరు గనక అలా చేస్తే క్రీస్తు మీకు వాగ్దానం చేసిన దానిని మీరు పోగొట్టుకుంటారు. ఈ మనుష్యులందరూ ఎప్పుడూ దర్శనాలు గురించి మాట్లాడుతూ దేవుడే వాటిని ఇచ్చి తమను చూడమని చెప్పాడని అంటారు. ఈ విషయాల గురించి వారు గొప్పలు చెప్పుకుంటారు.
\v 19 అలాంటి వ్యక్తులు క్రీస్తుతో లేరు. క్రీస్తే శరీరానికి శిరస్సు. ఆయనలో విశ్వాసముంచిన వారందరూ ఆ దేహమే. దేహం మొత్తం శిరస్సు మీద ఆధారపడుతుంది. ఆ శిరస్సే దేహంలోని ప్రతి భాగాన్నీ జాగ్రత్తగా చూసుకుంటుంది. ఎముకలనూ కీళ్ళను ఒక్కటిగా చేసి అన్నీ కలిసి పనిచేసేలా శిరస్సే చేస్తుంది. ఇంకా దానిని అభివృద్ది చేసేది మాత్రం దేవుడే.
\s5
\p
\v 20 క్రీస్తు చనిపోయినప్పుడు మీరు కూడా చనిపోయారని దేవుడు భావిస్తున్నాడు. ఇప్పుడు ఆ మనుష్యమాత్రులు చేసుకున్న నియమాలన్నీ దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో చూస్తున్నాయి. ఈ విషయాలలో ఏవీ మిమ్మల్నిఎప్పటికీ పరిపాలించలేవు. కాబట్టి వాటి కిందనే ఇంకా బ్రతుకుతున్నట్టుగా ఆ నియమాలకు మీరెందుకు లోబడి ఉండాలి?
\v 21 "అది పట్టుకోవద్దు, ఇది రుచి చూడవద్దు, ఇది ముట్టుకోవద్దు” లాంటి మనుషుల ఆజ్ఞలను ఎందుకు లెక్క చేయాలి? ఇలాంటి నియమాలకు మీరు ఇంకా లోబడి ఉండాలని ఆలోచించవద్దు.
\v 22 ఈ ఆజ్ఞలన్నీ లోకంలో మనుషులు ఉపయోగించడం కోసం చేసినవే. అవి నాశనమైపోయే విషయాలే. వాటిని తయారు చేసిందీ బోధించేదీ మనుషులే, దేవుడు కాదు.
\v 23 మనుషులు తమ సొంత జ్ఞానంతో దేవుణ్ణి ఆరాధించడానికి చేసుకున్నారు. అందుకనే కొన్నిసార్లు ఆ మనుషులు చాలా వినయంగా ఉంటారు. ఇంకా తమ శరీరాలను కొన్నిసార్లు గాయపరచుకుంటూ ఉంటారు. కానీ మనం గనక ఈ ఆజ్ఞలకు లోబడితే పాపం చేయాలనే కోరికను అడ్డుకోలేము.
\s5
\c 3
\p
\v 1 క్రీస్తు చనిపోయిన తర్వాత దేవుడు ఆయనను సజీవుడిగా తిరిగి లేపినట్టు మనల్ని కూడా ఆయన లేపాడు. క్రీస్తు మహా ఘనమైన గౌరవం, అధికారం ఉండే పరలోకంలో దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. మీరు కూడా అక్కడే ఉన్నట్టుగా ఉంటూ ఇక్కడ జీవించడానికి ప్రయత్నించాలి.
\v 2 క్రీస్తు పరలోకంలో మీకోసం దాచి ఉంచిన వాటినే కోరుకోండి. ఇక్కడ ఈ భూమిపై ఉన్న వాటి కోసం ఆశ పడకండి.
\v 3 ఎందుకంటే మీరు చనిపోయారు. ఇక ఎప్పటికీ ఈ భూమికి సంబంధించిన వారుగా దేవుడు మిమ్మల్ని చూడటం లేదు. మీరు క్షేమంగా ఉండాలని దేవుడు మిమ్మల్ని క్రీస్తులో దాచి ఉంచాడు.
\p
\v 4 ఎప్పుడైతే దేవుడు క్రీస్తును ఆయన ప్రకాశమైన వెలుగులో భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికీ వెల్లడి చేశాడో అప్పుడే ఆయన మిమ్మల్ని కూడా వెల్లడి చేశాడు ఎందుకంటే క్రీస్తు మిమ్మల్ని సజీవులుగా చేసాడు.
\s5
\p
\v 5 కాబట్టి, ఈ లోకంలో తప్పకుండా చంపేయాలనుకునే శత్రువుల వంటి మీ చెడు ఆశలను, కోరికలను గురించి ఆలోచించండి. వాటిని మీరు కచ్చితంగా తీసివేయాలి. వ్యభిచారం, అపవిత్రత, లైంగిక విశృంఖలత, దురాశ, ధన వ్యామోహానికి మారుపేరైన విగ్రహారాధనలను సంహరించండి.
\v 6 మనుషులు ఇలాంటి వాటిని చేయడం వల్లనే దేవుడు వారిపై కోపంతో ఉండి, వారు లోబడనందువల్లనే వారిని శిక్షిస్తాడు.
\p
\v 7 గతంలో మీరు వారితో కలసి నివసించినప్పుడు మీరూ ఇవన్నీ చేస్తూ వచ్చారు. వారిలాగే ప్రవర్తించారు.
\v 8 కానీ ఇప్పుడు మీరు వాటన్నిటినీ చేయడం ఆపెయ్యాలి. ఒకరిమీద ఒకరు కోపపడకూడదు. ఇంకొకరికి మీరు సమస్యగా ఉండకూడదు. ఇతరులను నిందించడం అవమానకరమైన మాటలు మాట్లాడడం మీరు చేయకూడదు.
\s5
\v 9 ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు. వీటిలో దేనినీ మీరు చేయవద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక కొత్త మనిషిగా మారారు. మీరు ఈ చెడ్డ సంగతులను ఇక ఎప్పటికీ చేయకూడదు.
\v 10 మీరు ఒక నూతన వ్యక్తి. దేవుడు మిమ్మల్ని సృష్టించాడు, ఆయనలా మీరు ఉండాలని ఆయన గురించి మీరు ఇంకా బాగా తెలుసుకోనేలా ఆయన ఎప్పుడూ చేస్తుంటాడు.మీరు
\v 11 క్రీస్తుతో మనం కలిసి ఉన్నందువల్ల దేవుడు మనలను కొత్త వ్యక్తులనుగా చేశాడు. ఇంకా ఆయన ఎప్పుడూ మనలను కొత్తగా చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఎవరైనా యూదుడని కానీ యూదేతరుడని కానీ సున్నతి పొందాడా అని కానీ సున్నతి పొందలేదా అని కానీ పరదేశీయుడా లేక అనాగరికుడా అని కానీ బానిసా లేక బానిస కాదా అని కానీ ఇవేవీ ముఖ్యం కాదు. మీ అందరిలో ఉన్న క్రీస్తే అన్నింటికన్నా ముఖ్యమైనవాడు.
\s5
\p
\v 12 కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎన్నుకుని తన ప్రజలనుగా ప్రత్యేక పరచి ప్రేమిస్తున్నందువల్ల మీరు సాత్వికంతో కనికరంతో దయతో ఇతరులకు సేవ చేయండి. వినయంతో సహనంతో ఒకరినొకరు సున్నితంగా చూసుకోండి.
\v 13 ఒకరినొకరు సహించుకోండి. ఎవరి మీదైనా చాడీలు ఉంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ క్షమించండి. అలాగే మీరు ఒకరికొకరు క్షమించుకోండి.
\v 14 వీటన్నిటికంటే ముఖ్యంగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఎందుకంటే అలా చేయటం వల్ల మిమ్మల్ని మీరు పరిపూర్ణ బంధంలో ఇముడుతారు.
\s5
\p
\v 15 మీరు దేవునితోనూ ఒకరితో ఒకరూ సమాధానంతో జీవించేలా క్రీస్తు ఒక్కడే చేయగలిగాడు కాబట్టి ఎప్పుడూ సమాధానంగా ప్రవర్తించండి. ఇంకా ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞులై ఉండండి.
\v 16 మీరు జీవిస్తూ దేవునికి సేవ చేస్తున్నపుడు క్రీస్తు మీకు బోధించినట్టుగా ఎప్పుడూ ఆయనకు లోబడి ఉండండి. సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, బుద్ది చెప్పుకోండి. కృతజ్ఞత కలిగి కీర్తనలతోనూ భజనలతోనూ గానాలతోనూ దేవునికి పాటలు పాడుతూ ఆయనను కీర్తించండి.
\v 17 మాటతో గానీ పనులతో గానీ, మీరేది చేసినా ప్రభువైన యేసును గౌరవించేలా చేయండి. ఇది చేస్తున్నప్పుడు తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు అర్పిస్తూ చేయండి.
\s5
\p
\v 18 భార్యలారా, మీ భర్తలకు లోబడండి. ప్రభువైన యేసు ఆజ్ఞాపించిన ప్రకారం ఇది తగినది.
\v 19 భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి. వారితో కటువుగా ఉండకండి.
\p
\v 20 పిల్లలారా, అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. ఇది ప్రభువుకు ఇష్టంగా ఉంటుంది.
\v 21 తండ్రులారా, మీ పిల్లలు నిరుత్సాహపడకుండా ఉండేలా వారిలో కోపం కలిగించవద్దు.
\s5
\p
\v 22 బానిసలారా, ప్రతి విషయంలోనూ ఈ లోకంలో మీ యజమానులకు లోబడి ఉండండి. వాళ్ళు ఎప్పుడూ లోబడే ఉంటారని తమ యజమానులు అనుకోవాలని మీ పై అధికారులు గమనిస్తున్నపుడు మాత్రమే లోబడడం కాదు. ప్రభువైన యేసును మీరు గౌరవిస్తున్నారు కాబట్టి మీరు మీ యజమానులకు మనస్పూర్తిగా లోబడి ఉండండి.
\v 23 మీరు ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేయండి. మనుషుల కోసం అని కాదు గానీ ప్రభువుకు చేస్తున్నట్టు భావించుకుని చేయండి.
\v 24 ఎందుకంటే ప్రభువు మీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రభువు మీకు వాగ్దానం చేసిన వారసత్వంలోని భాగాన్ని మీరు అందుకుంటారు. మీరు సేవిస్తున్న యేసుక్రీస్తే మీకు నిజమైన యజమాని.
\v 25 దేవుడు ప్రతిఒక్కరికీ ఒకేలాగా తీర్పు తీరుస్తాడు. తప్పు చేసేవాడికి తాను చేసిన తప్పుకి తగిన శాస్తి జరుగుతుంది.
\s5
\c 4
\p
\v 1 యజమానులారా, పరలోకంలో మీకు కూడా యజమాని ఉన్నాడని గ్రహించి మీ దాసుల పట్ల న్యాయంగా వ్యవహరిస్తూ వారికి అవసరమైనవి అందజేయండి.
\s5
\p
\v 2 నిరంతరాయంగా ప్రార్థన చేస్తూ ఉండండి. బద్ధకస్తులుగా ఉండకుండా ప్రార్థన చేస్తూ, దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి.
\v 3 దేవుడు ప్రతి చోటా క్రీస్తు గురించిన రహస్యాన్ని వెల్లడిచేస్తూ ఉన్న విధంగా శుభవార్తను స్వేచ్ఛగా వివరించడానికి దేవుడు మాకు వీలు కల్పించేలా మా కోసం కలిసి ప్రార్థన చేయండి. ఈ శుభవార్తను మేము ప్రకటించిన కారణంగా నేను ఇప్పుడు జైల్లో ఉన్నాను.
\v 4 నేను సంపూర్ణంగా శుభవార్తను వివరించగలిగేలా ప్రార్థన చేయండి.
\s5
\p
\v 5 ప్రతి క్షణాన్నీ విలువైనదిగా చూస్తూ, జ్ఞానం ఉపయోగిస్తూ అవిశ్వాసుల మధ్య వివేకంగా జీవించండి.
\v 6 యేసు ప్రభువులో విశ్వాసం లేని వాళ్ళతో ఎప్పుడూ ఆహ్లాదంగా, ఆసక్తిగా, దయగా మాట్లాడుతూ ఉండండి. అప్పుడు ప్రభువును గురించి ప్రతి ఒక్కరితో ఎలా మాట్లాడాలో మీరు తెలుసుకుంటారు.
\s5
\p
\v 7 నాకు ఏమి జరుగుతుందో తుకికు మీకు చెప్తాడు. అతడు యేసు ప్రభువును నాతో కలిసి సేవిస్తూ, నమ్మకంగా నాకు సాయం చేస్తున్నవాడు, నేను ప్రేమించే నా తోటి విశ్వాసి.
\v 8 మీరు మా గురించి తెలుసుకోవాలనీ అతడు మిమ్మల్ని ప్రోత్సహించాలనీ తుకికుకు ఈ ఉత్తరం ఇచ్చి పంపుతున్నాను.
\p
\v 9 మీ ఊరి వాడు, నేను ప్రేమించేవాడూ నమ్మకమైన తోటి విశ్వాసి అయిన ఒనేసిముతో అతన్ని పంపుతున్నాను. ఇక్కడ ఏమి జరుగుతుందో అదంతా వాళ్ళు మీకు చెప్తారు.
\s5
\p
\v 10 మార్కుతో నాతో కూడా జైలులో ఉన్నవాడూ బర్నబాకు దగ్గర బంధువూ అయిన అరిస్తార్కు మీకు శుభాలు చెప్తున్నాడు. మార్కు గురించి మీకు ముందే వివరించాను కాబట్టి, అతను మీ దగ్గరికి వస్తే అతన్ని ఆహ్వానించండి.
\p
\v 11 జస్టస్ అనే పేరు గల యేసు కూడా మీకు శుభాలు చెప్తున్నాడు. యేసు క్రీస్తు ద్వారా దేవుణ్ణి రాజుగా ప్రకటించడంలో నాతో కలిసి పనిచేసే ఈ ముగ్గురు మాత్రమే విశ్వాసులైన యూదులు. వాళ్ళు నాకు ఎంతో సాయం చేసి, నన్ను ప్రోత్సహించారు.
\s5
\p
\v 12 మీ ఊరి వాడు, క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు శుభాలు చెప్తున్నాడు. దేవుడు మనకు బోధించిందీ, వాగ్దానమిచ్చిందీ అంతా మీరు బలంగా నమ్మాలని అతడు మీ కోసం ఎంతో ప్రాధేయపడుతూ ప్రార్థన చేస్తున్నాడు.
\v 13 హియరాపొలిలో నివసిస్తున్న వాళ్ళ కోసం, లవొదికయలో ఉన్న వాళ్ళ కోసం అతను చాలా కష్టపడి పనిచేసాడని నేను చెప్పగలను.
\p
\v 14 నేను ప్రేమించే వైద్యుడు లూకా, దేమా మీకు శుభాలు తెల్పుతున్నారు.
\s5
\p
\v 15 లవొదికయలో నివసించే తోటి విశ్వాసులకు వందనాలు. నుంఫాకు, ఆమె ఇంటిలో సమకూడే విశ్వాసుల గుంపుకు నా వందనాలు.
\v 16 మీరు ఈ ఉత్తరం చదివాక, లవొదికయ సంఘంలో కూడా ఈ ఉత్తరం చదివించండి. లవొదికయ నుండి వచ్చిన ఉత్తరం కూడా చదవండి.
\v 17 దేవుడు తనకు ఇచ్చిన పనిని పూర్తిచేయాలని అర్కిప్పుకు చెప్పండి.
\s5
\p
\v 18 నా సొంత చేరాతతో పౌలు అనే నేను రాస్తున్నాను. జైలులో ఉన్న నన్ను జ్ఞాపకం ఉంచుకుని నా గురించి ప్రార్థన చేయండి. మీ అందరిపై మన యేసు క్రీస్తు ప్రభువు దయ చూపడం కొనసాగించాలని నా ప్రార్థన.