STR_te_iev/49-GAL.usfm

289 lines
83 KiB
Plaintext

\id GAL - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h గలతీయులకు రాసిన పత్రిక
\toc1 గలతీయులకు రాసిన పత్రిక
\toc2 గలతీయులకు రాసిన పత్రిక
\toc3 gal
\mt1 గలతీయులకు రాసిన పత్రిక
\s5
\c 1
\p
\v 1 గలతీ ప్రాంతంలో ఉన్న నా ప్రియమైన అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు పౌలనే నేను ఈ ఉత్తరం రాస్తున్నాను. పౌలనే నేను అపోస్తలుడను. ఏ మనిషీ నన్ను అపోస్తలుడుగా చేయలేదు. అపోస్తలులలో ఒకడిగా నన్ను చేయమని దేవుడు ఎవరికీ చెప్పలేదు. నేను అపోస్తలుడను, ఎందుకంటే యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు నన్ను అపోస్తలులలో ఒకడిగా ఏర్పాటు చేశాడు.
\v 2 అవును సహోదరులారా, క్రీస్తు చనిపోయినప్పుడు తండ్రియైన దేవుడు మళ్ళీ ఆయనను బ్రతికించాడు. ఆయనే నన్ను అపోస్తలుడుగా నియమించాడు. నేనూ నా తోటి విశ్వాసులూ గలతీ ప్రాంత సంఘ విశ్వాసులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము.
\s5
\p
\v 3 మన తండ్రియైన దేవుడు, యేసు క్రీస్తూ మీకు దయతో సహాయం చేయాలనీ, శాంతిని ప్రసాదించాలనీ నేను దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను.
\v 4 ఈ లోకంలోని ప్రజలు నడిచే చెడ్డదారుల్లో నుంచి మనల్ని దూరంగా తీసుకు రావడానికి క్రీస్తు తనకు తానుగా మన పాపాల కోసం బలిగా అర్పించుకున్నాడు. మన తండ్రియైన దేవుడు ఆయన్ని ఆ విధంగా చేయాలని కోరుకున్నాడు.
\v 5 ఇది గొప్ప సత్యం కాబట్టి ఇప్పుడు మనం ఎన్నటెన్నటికీ దేవునికి స్తుతులూ మహిమా చెల్లించాలి.
\s5
\p
\v 6 తనలో నమ్మకం ఉంచడానికి క్రీస్తు తన దయతో మిమ్మల్ని పిలిచాడని మీకు తెలుసు. కానీ ఇప్పుడు ఆయనలో నమ్మకం ఉంచడం మానుకున్నారని తెలిసి నేను చాలా నివ్వెరబోతున్నాను. కొందరు ఇదే నిజమైన దేవుని సువార్త అని చెబుతుంటే మీరు ఆ భిన్న బోధలను నమ్ముతున్నారు.
\v 7 క్రీస్తు ఎన్నడూ మరో సువార్తను మనకు చెప్పలేదు. కానీ కొందరు మనుషులు మిమ్మల్ని తికమక పెడుతున్నారు. క్రీస్తును గూర్చిన సువార్తను తారుమారు చేయాలని చూస్తున్నారు. క్రీస్తు వేరే ఇంకేదో చెప్పాడని మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు.
\s5
\v 8 కానీ అపోస్తలులమైన మేము గానీ పరలోకంలో ఉండే దేవదూతలైనాగానీ వచ్చి, ఇంతకు ముందు చెప్పినది కాకుండా వేరే వార్తను సువార్త అని చెప్పినట్లయితే వారిని దేవుడు శాశ్వతంగా శిక్షించాలి.
\v 9 మేము ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇప్పుడు మళ్ళీ చెపుతున్నాను. వేరెవరైనా మీరు నమ్మిన సువార్త కాకుండా వేరే సువార్తను బోధించి, ఇదే మంచిదని చెప్పారనుకోండీ, అలాంటి మనుషుల్ని శాశ్వతంగా శిక్షించాలని నేను దేవుణ్ణి అడుగుతాను.
\p
\v 10 నన్ను మనుషులు ఇష్టపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని ఆమోదమే నాకు కావాలి. నేను మనుషుల దయ కోసం ప్రయత్నం చేయను. నేను మనుషుల దయ కోసం ప్రయత్నిస్తే నిజంగా క్రైస్తవ సేవ చేయలేను. యథార్థ వాది లోక విరోధి కదా!
\s5
\p
\v 11 నా తోటి విశ్వాసులారా, నేను ప్రజలకు క్రీస్తును గూర్చి ప్రకటించిన సువార్త, కొంతమంది మనుషులు కపటంగా సృష్టించిన సువార్త ఒకటే కాదని మీరందరూ తెలుసుకోవాలి.
\v 12 ఈ సువార్తను నేను సాధారణ వ్యక్తుల నుండి నేర్చుకోలేదు. అలాంటి వ్యక్తులెవ్వరూ ఈ సువార్తను నాకు నేర్పలేదు. మన ప్రభువైన యేసు క్రీస్తు వారే ఈ సువార్తను తనకు తానుగా నాకు బోధించారు.
\s5
\p
\v 13 గతంలో యూదా మత పద్ధతుల్లో నేను దేవుణ్ణి ఆరాధించేవాణ్ణని నా గూర్చి మనుషులు మీకు చెప్పారు కదా. దేవుడే స్థాపించిన విశ్వాసుల సంఘాన్ని నిరంతరం హింసిస్తుండే వాణ్ని. మీ సంఘాలనూ మీ విశ్వాసులనూ నాశనం చేయడానికి నేను శతవిధాల ప్రయత్నం చేశాను.
\v 14 నా తరంలోని మిగతా యూదులందరి కంటే ఎక్కువగా యూదా మత విశ్వాసంలో దేవుణ్ణి ఆరాధించే వాణ్ణి. మిగతా యూదులలో మన పూర్వికులు ఏర్పాటు చేసి పాటించిన ఆచారాలను నిర్లక్ష్యం చేసి పాటించక పోతుంటే చూసి అగ్గి మీద గుగ్గిలమయ్యే వాడిని.
\s5
\v 15 నేను నా తల్లి కడుపులో ఉన్నప్పుడే దేవుడు తన సేవకు నన్ను ఎంపిక చేశాడు. ఆయన అలా చేయడానికి కారణం ఏంటంటే ఆయనకు నాపై దయ కలిగింది.
\v 16 యేసు ప్రభువు తన కుమారుడని ఆయన నాకు చూపించాడు. యూదేతరులు నివసిస్తున్న ప్రాంతాల్లో తన కుమారుడిని గూర్చిన సువార్తను ఇతరులకు చెప్పడానికి ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈ సువార్త చక్కగా అర్థం చేసుకోవడానికి నాకు అందుబాటులో ఉన్న ఏ మనిషి దగ్గరకూ నేను వెంటనే వెళ్లలేదు.
\v 17 నేను దమస్కును వదిలి ఎక్కడకీ వెళ్ళలేదు. యెరూషలేములో నాకంటే ముందుగా అపోస్తలులుగా ఉన్న వ్యక్తులను చూడ్డానికి వెళ్ళలేదు. నేను అరేబియా అరణ్య ప్రాంతానికి వెళ్ళాను. తరవాత అక్కడ నుండి దమస్కు నగరానికి తిరిగి వచ్చాను.
\s5
\p
\v 18 దేవుడు ఈ సువార్తను నాకు వెల్లడి చేసిన మూడు సంవత్సరాల తర్వాత పేతురును కలవడానికి యెరూషలేముకు వెళ్లాను. అతనితో కలిసి 15 రోజులు ఉన్నాను.
\v 19 మన యేసు ప్రభువు తమ్ముడు యాకోబును చూశాను. యెరూషలేములోని విశ్వాస సంఘ నాయకుల్ని కూడా కలిశాను. అంతే తప్ప మిగతా అపోస్తలులనెవ్వరినీ నేను కలవలేదు.
\v 20 నేను మీకు రాస్తున్నదంతా సత్యమని దేవునికి తెలుసు.
\s5
\p
\v 21 తరువాత యెరూషలేము నుండి సిరియా, కిలికియా ప్రాంతాలకు వెళ్ళాను.
\v 22 యూదయ ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవ సమాజంలోని వారెవ్వరూ అప్పటికి నన్ను చూడలేదు.
\v 23 వాళ్ళు గతంలో మనం విశ్వసించిన సువార్తను ఆపడానికి మనపై చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన పౌలు అనే వ్యక్తి ఇప్పుడు అదే సువార్త ప్రకటిస్తున్నాడని మాత్రమే ఇతరులు పదే పదే అనుకోవడం విన్నారు.
\v 24 నా విషయంలో దేవుడు చేసిన దాన్ని బట్టి వారందరూ దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారు.
\s5
\c 2
\p
\v 1 పద్నాలుగు సంవత్సరాల తర్వాత నేను, తీతు, బర్నబా కలిసి మళ్ళీ యెరూషలేముకు వెళ్ళాము.
\v 2 దేవుడు మమ్మల్ని వెళ్ళమని చెప్పాడు కాబట్టే వెళ్ళాము. యూదేతరులు ఉండే ప్రాంతాల్లో నేను ప్రకటిస్తున్న సత్య సువార్తకు సంబంధించిన విషయాలను విశ్వాస సంఘాల్లో ముఖ్యమైన పెద్దలందరినీ ప్రత్యేకంగా సమావేశపరిచి వివరించాను. నేను బోధిస్తున్న విషయాలు వారందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నాయో లేవో నిర్ధారించుకోడానికి ఇలా చేశాను. నేను చేస్తున్న పని నిరుపయోగం కాలేదని నిర్ధారించుకోవాలని నా ఉద్దేశం.
\s5
\p
\v 3 నాతోపాటు ఉన్న తీతు సున్నతి లేని అన్యుడు. అతడు గ్రీసు దేశస్తుడు. అయితే అతడు సున్నతి చేసుకోవలసిన అవసరం లేదని ఆ పెద్దలు అనుకున్నారు.
\v 4 అయితే తీతు సున్నతి చేసుకోవలసిన అవసరం ఉందని చెప్పే వాళ్ళు నిజమైన విశ్వాసులు కారు. కానీ వాళ్ళు తోటివిశ్వాసుల్లాగా నటించారు. యూదా మత నియమాలనూ ఆచారాలనూ పాటించకుండా దేవుడికి ఎలా విధేయత చూపుతున్నామో తెలుసుకోవడానికి వాళ్ళు మమ్మల్ని నిశితంగా పరిశీలిస్తూ ఉండడం మేము గమనించాము. యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ ఆచారాల నుండి, నియమాల నుండి మనల్ని విడిపించాడని తెలిసినప్పటి నుండీ వాటిని మేము పాటించడం లేదు. ధర్మశాస్త్ర నియమాలకు మమ్మల్ని బానిసలుగా చేయాలని ఆ కపట విశ్వాసులు ప్రయత్నించారు.
\p
\v 5 సున్నతిని గూర్చి వారితో ఒక్క క్షణం కూడా మేము ఏకీభవించడానికి అంగీకరించలేదు. క్రీస్తును గూర్చిన సువార్త వల్ల మీరు లాభం పొందుతూ ఉండాలని మేము వారిని వ్యతిరేకించాము.
\s5
\v 6 అయితే నేను ప్రకటించడానికి అక్కడ పెద్దలమని చెప్పుకునే వాళ్ళెవ్వరూ ఏమీ అదనంగా చేర్చలేదు. ఈ పెద్దలు చాలా ప్రముఖమైన వ్యక్తులు. వాళ్ళు ఎవరైనా కానీ నేను పట్టించుకోను. ఎందుకంటే దేవుడు ఏ కొద్ది మంది విషయంలోనో పక్షపాతం చూపేవాడు కాదు.
\v 7 పేతురు యూదులకు సువార్త ప్రకటిస్తున్నట్లుగానే దేవుడు యూదేతరులకు సువార్తను ప్రకటించడానికి నాపై నమ్మకం ఉంచాడని ఆ పెద్దలకు అర్థం అయింది.
\v 8 యూదులకు దేవుని సందేశాన్ని తీసుకెళ్ళే బాధ్యతను అపోస్తలుడినైన నాకు కూడా దేవుడే అప్పగించాడు.
\s5
\v 9 ఈ ప్రత్యేకమైన పరిచర్య బాధ్యతను దేవుడు దయతో నాకు ఇచ్చాడని ఆ పెద్దలకి స్పష్టంగా అర్థం అయింది. క్రీస్తులో విశ్వాసముంచే వారందరికీ యాకోబు, పేతురు, యోహానులు మూల స్తంభాల్లాంటి ముఖ్యమైన పెద్దలు. వీళ్ళు అనేక మందికి తెలిసిన వాళ్ళు. అందరూ వీళ్ళను గౌరవిస్తారు. వాళ్ళు మాతో చేతులు కలిపారు. ఎందుకంటే మేము వారి తోటి దేవుని సేవకులమని భావించారు. సున్నతి ఉన్న యూదుల దగ్గరకు వాళ్ళని పంపినట్లే సున్నతి లేని యూదేతరుల దగ్గరకు మమ్మల్ని దేవుడు పంపాడని మేమందరం అంగీకరించాము.
\p
\v 10 యెరూషలేములో నివసిస్తున్న తోటి విశ్వాసుల్లోని పేదలకు సహాయం చేయడం మరవ వద్దని వాళ్ళు మమ్మల్ని అభ్యర్ధించారు. నేనూ ఎంతో ఆసక్తితో చేస్తున్నది కూడా సరిగ్గా ఇదే.
\s5
\p
\v 11 అయితే నేను అంతియొకయ నగరంలో ఉన్న సమయంలో పేతురు అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో జరిగిన దాని విషయంలో పేతురు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అతడు అక్కడ చేస్తున్నది తప్పు అని ఎత్తి చూపాను.
\v 12 అసలు అక్కడ జరిగింది ఏంటంటే, పేతురు అంతియొకయకు వెళ్ళినపుడల్లా చేస్తున్నట్లుగానే యూదేతరులతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఆ సమయంలో యెరూషలేము విశ్వాస సంఘానికి పెద్ద అయిన యాకోబు తమను పంపాడని చెప్పుకుంటున్న కొంతమంది యూదులు అక్కడికి వచ్చారు. ఆ మనుషులు అక్కడికి వచ్చినపుడు పేతురు యూదేతరులతో కలిసి భోజనం చేస్తున్నాడు. వాళ్ళను చూసిన పేతురు భోజనం చేయడం ఆపివేసి దూరంగా జరిగిపోయాడు. వాళ్ళతో కలవలేదు. అంతేకాకుండా యూదేతరులతో కలవడం వల్ల యెరూషలేము నుంచి వచ్చిన యూదులు తనని విమర్శిస్తారని భయపడ్డాడు.
\s5
\v 13 అంతేకాకుండా పేతురు అలా చేయడం చూసిన అంతియొకయ లోని మిగతా యూదులు యూదేతర విశ్వాసుల్లోంచి తమకై తాము వేరుపడి పేతురు కపటంలో కలిసిపోయారు. వారిని చూసిన బర్నబా సైతం యూదేతరులతో కలవడం మానేశాడు.
\p
\v 14 క్రీస్తును గూర్చిన సువార్త సత్యాన్ని వాళ్ళు సరిగా అనుసరించడం లేదని నాకు అప్పుడు అర్థం అయింది. అప్పుడు తోటి విశ్వాసులందరూ కలిసి వచ్చినపుడు అందరి ఎదుటా పేతురుతో నేను ఇలా చెప్పాను. "నువ్వు యూదుడివి అయిఉండి కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించని యూదేతరుడుగా జీవిస్తున్నావు. మరి యూదేతరుల్ని యూదుల్లా జీవించమని ఎలా ఒప్పిస్తావు?
\s5
\v 15 మనం యూదులుగా పుట్టాము. కానీ దేవుని ధర్మశాస్త్రం గూర్చి ఏమాత్రం తెలియని యూదేతర పాపులం కాదు.
\v 16 ఏ వ్యక్తీ దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా దేవుని దృష్టిలో న్యాయవంతుడు కాలేడని మనకు ఇప్పుడు తెలుసు. యేసు క్రీస్తులో నమ్మకం ఉంచిన వాణ్ణి మాత్రమే దేవుడు న్యాయవంతునిగా చేస్తాడు. మనలోని కొంతమంది యూదులం కూడా యేసు క్రీస్తులో నమ్మకం ఉంచాము. యేసు క్రీస్తులో నమ్మకం ఉంచాము కాబట్టి దేవుడు తన దృష్టిలో మనల్ని సరైన వారిగా ప్రకటిస్తాడు. అంతేకానీ దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ప్రయత్నించామని కాదు. ధర్మశాస్త్రానికి విధేయత చూపించారు కాబట్టి మిమ్మల్ని సరైన వారిగా గుర్తిస్తానని తాను చెప్పలేదని దేవుడు చెప్పాడు.
\s5
\v 17 మనం పాపం చేసాము కాబట్టి ధర్మశాస్త్రం మనల్ని పాపులుగా నిర్ధారిస్తుంది. ఆ ధర్మశాస్త్రానికి విధేయత చూపడం మానివేసి యేసు క్రీస్తులో నమ్మకం ఉంచడం ద్వారా మనల్ని పాప విముక్తుల్నిగా మార్చమని దేవుణ్ణి అడిగాము. అయితే దీని అర్థం క్రీస్తు పాపానికి అనుకూలమైన వాడని కాదు, ఎంత మాత్రమూ కాదు.
\p
\v 18 అయితే నేను దేవునిలో నమ్మకం ఉంచి మళ్ళీ ధర్మ శాస్త్రానికి విధేయత చూపిస్తున్నాను కాబట్టి ఆయన దృష్టిలో నిర్దోషిగా మార్చమని అడగడం ఎలా ఉంటుందంటే, ఒకడు కూలిపోవడానికి సిద్దంగా ఉన్న తన పాత భవనాన్ని తానే కూల్చివేసి ఆ శిథిలాలతోనే మళ్ళీ దాన్ని నిర్మించడం లాంటిది. అలా దేవుని ధర్మశాస్త్రాన్ని మీరుతున్నారని ప్రతి ఒక్కరికీ కనిపిస్తుంది.
\p
\v 19 దేవుని ధర్మశాస్త్రానికి విధేయత చూపించడానికి ప్రయత్నించడం అంటే నేను మృత స్థితిలోకి మారడం లాంటిదే. నేను నమ్ముకున్న ధర్మశాస్త్రమే నన్ను చంపినట్లుగా ఉంది. ఆవిధంగా ధర్మశాస్త్ర విషయంలో చనిపోయిన నేను ఇక దేవుణ్ణి ఆరాధించడానికి జీవిస్తాను.
\s5
\v 20 క్రీస్తు సిలువపై మరణించినపుడే నా పాత జీవన విధానం ముగిసినట్లే. నేను ఎన్నటికీ నేనుగా నా జీవితాన్ని నడిపించను. నేను ఏవిధంగా జీవించాలనేది నా హృదయంలో జీవిస్తున్న క్రీస్తే నిర్ణయించి నడిపిస్తాడు. ఇక ఇప్పుడు నేను జీవిస్తూ ఏమి చేసినా కూడా దేవుని కుమారుడైన క్రీస్తులో నమ్మకం ఉంచి చేస్తాను. ఎందుకంటే ఆయన నన్ను ఎంతో ప్రేమించాడు. అంతే కాకుండా నేను చేసిన పాపాలనుంచి దేవుని క్షమను అందించడం కోసం తనను తాను బలి అర్పణగా సమర్పించుకున్నాడు.
\v 21 మళ్ళీ ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా దేవుడు మనల్ని నిర్దోషులుగా చేస్తాడని భావించి నేను దేవుడు ఇచ్చిన తన దయను ప్రక్కకు పెట్టలేను. ఒకవేళ ధర్మశాస్త్రమే మనల్ని నిర్దోషులుగా చేస్తే క్రీస్తు సిలువపై మరణించడం వ్యర్ధమే కదా!
\s5
\c 3
\p
\v 1 గలతీలో ఉన్న నా తోటి విశ్వాసులారా! మీరు చాలా అవివేకులు. కొందరు చెడ్డ మనస్తత్వంతో మిమ్మల్ని తమ చేతుల్లో కీలు బొమ్మలుగా చేసుకుని ఉండాలి. యేసు క్రీస్తు ప్రభువుని వాళ్ళు ఎలా సిలువ వేశారో నేను సరిగానే మీకు చెప్పాను. కాదా?
\v 2 నాకు ఒక్క విషయం చెప్పండి, పరిశుద్దాత్మ మీ దగ్గరకు వచ్చాడు కదా. మీరు మోషే ధర్మ శాస్త్రానికి లోబడ్డారని వచ్చాడా లేక మీరు సత్య సువార్త విని క్రీస్తులో విశ్వాసం ఉంచడం వల్ల వచ్చాడా? క్రీస్తులో విశ్వాసం ఉంచడం వల్లనే గదా. కచ్చితంగా ఇదే జరిగింది.
\p
\v 3 మీరు ఇంత తెలివిమాలిన వారా! దేవుని ఆత్మ మీకు ఆవిధంగా అవకాశం ఇవ్వడం వల్లనే మీరు మొదటిగా క్రైస్తవులయ్యారు. కానీ ఇప్పుడు మీరు ధర్మ శాస్త్రానికి లోబడడానికి గట్టిగా ప్రయత్నించడం ద్వారా చనిపోయేవరకూ సాధ్యమైనంత విధేయత చూపించాలని అనుకుంటున్నారు. అలాగే కొనసాగాలని అనుకుంటున్నారు.
\s5
\v 4 క్రీస్తులో విశ్వాసం ఉంచిన తర్వాత మీరు అన్ని రకాల బాధలు, హింసలు అనుభవించారు. కానీ ఇప్పుడు ఆయనపై విశ్వాసం లేకపోవడం వల్ల మీరు అనుభవించిన ఆ శ్రమలకు బాధలకు ఏమాత్రం విలువలేకుండా చేశారు.
\v 5 ఇప్పుడు దేవుడు తన ఆత్మను ఉచితంగా మీకు ఇస్తూ, మీ మధ్య గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. ఇవన్నీ దేవుడు మీరు ధర్మ శాస్త్రానికి లోబడడం వల్ల చేస్తున్నాడని ఆలోచిస్తున్నారా? అది నిజం కాదని మీకు తెలుసు. ఎందుకంటే ఇవన్నీ క్రీస్తును గూర్చిన సువార్తను విని, ఆయనలో విశ్వాసం ఉంచడం వల్లనే జరిగాయని మీకు తెలుసు.
\s5
\p
\v 6 అబ్రాహాము ఏవైతే పొందాడని గ్రంథాలలో మోషే రాశాడో అదే ఇప్పుడు మీరు పొందుతున్నది. అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు. దాని ఫలితంగా దేవుడు అబ్రాహాముని తన దృష్టిలో నీతిమంతుడుగా భావించాడు అని మోషే గ్రంథాల్లో రాశాడు.
\v 7 కాబట్టి మీరు అర్థం చేసుకోవలసినది ఏంటంటే, ఎందరైతే క్రీస్తులో విశ్వాసం ఉంచుతారో, వాళ్ళందరినీ దేవుడు రక్షించి, అబ్రాహాము వారసులుగా మారుస్తాడు.
\v 8 యూదేతరులు ఆయనలో విశ్వాసం ఉంచినపుడు, వాళ్ళను నీతిమంతులుగా దేవుడు మారుస్తాడని, అలా ఆయన మార్చక మునుపే ఆ విధంగా చేస్తాడనీ, తమ గ్రంథాల్లో ప్రవక్తలు రాశారు. దేవుడు ఈ సువార్తను అబ్రాహాముకు ముందే ప్రకటించాడు. దీన్ని గూర్చి గ్రంథంలో ఈ విధంగా రాశారు. నువ్వు చేసినదాని వల్ల ప్రపంచంలోని జన జాతులన్నిటినీ ఆశీర్వదిస్తాను.
\v 9 కాబట్టి క్రీస్తులో విశ్వాసం ఉంచిన వాళ్ళందరినీ, దేవుడిలో విశ్వాసం ఉంచిన అబ్రాహాము తోపాటు ఆశీర్వదిస్తాడు అని దీని ద్వారా మనకు తెలుస్తుంది.
\s5
\v 10 తన ధర్మ శాస్త్రానికి విధేయత చూపించడం ద్వారా దేవుడి అనుగ్రహం పొందగలం అనుకునే వాళ్ళందరినీ దేవుడు నడిపిస్తాడు. లేఖనాల్లో "ధర్మశాస్త్ర గ్రంథంలో మోషే రాసిన నియమ నిబంధనలను నిరంతరంగా, పూర్తిగా పాటించకపోతే ప్రతి ఒక్కరినీ దేవుడు శాశ్వతంగా శిక్షిస్తాడు" అని రాసి ఉంది.
\v 11 అయితే దేవుడు నేను ఏ వ్యక్తినైనా నీతిమంతుడుగా ప్రకటిస్తాను. కానీ అది తన ధర్మ శాస్త్రానికి విధేయత చూపించడం మూలంగా కాదు అని చెప్పాడు. తనపై విశ్వాసం ఉంచారు కాబట్టి ఆ ప్రతి వ్యక్తినీ దేవుడు నీతిమంతుడని ప్రకటిస్తాడు. అలా ప్రకటించిన ప్రతి వ్యక్తీ నిత్యం జీవిస్తాడు అని మన లేఖనాల్లో చదువుకోవచ్చు.
\v 12 ఎవరైతే ధర్మ శాస్త్రానికి విధేయత చూపిస్తారో, వాళ్ళు క్రీస్తులో విశ్వాసం ఉంచరు. ధర్మశాస్త్రంలోని విషయాలను చేయడం ప్రారంభించి వాళ్ళు దానిలోని అన్నిటికీ విధేయత చూపించి అన్నిటినీ అనుసరిస్తూ చేయాలి.
\s5
\p
\v 13 ధర్మశాస్త్రంలో రాసినట్టు దేవుడు మనల్ని శపించకుండా క్రీస్తు కచ్చితంగా ఆపాడు. మన స్థానంలో క్రీస్తును దేవుడు శపించినప్పుడు ఇది జరిగింది. మాను మీద వ్రేలాడదీసే ప్రతివ్యక్తినీ దేవుడు శపిస్తాడు. అని లేఖనాల్ రాలో సినవి మీరు చదవొచ్చు.
\v 14 అబ్రాహామును దీవించినట్టే దేవుడు క్రీస్తులో విశ్వాసం ఉంచిన యూదేతరులను దీవించడం కోసం ఆయన క్రీస్తును శపించాడు. ఆ విధంగా యూదేతరులను దేవుడు దీవించాడు. కాబట్టి క్రీస్తులో విశ్వాసముంచిన అందరికీ ఆయన ఇస్తానని వాగ్దానం చేసిన పరిశుద్దాత్మను మనం పొందవచ్చు.
\s5
\p
\v 15 నా తోటి విశ్వాసులారా, ఇద్దరి వ్యక్తుల మధ్య ఉన్న ఒప్పందం లాంటిదే దేవుని వాగ్దానం. ఒక్కసారి ఇద్దరు సంతకం చేసిన తరువాత దాన్ని ఎవ్వరూ రద్దు చేయలేరు, దానికి ఎలాటిదీ కలపలేరు.
\v 16 అబ్రాహాముకు, అతడి వారసుల్లో ప్రత్యేకమైన వాళ్ళకు దేవుడు వాగ్దానం చేశాడు. గ్రంథాలలో నీ వారసులకు అని చెప్పడం లేదు. నీ వారసులకు అంటే అనేకమంది వారసులు అనే అర్థం వస్తుంది. కానీ దానికి బదులుగా నీ వారసుడు అని గ్రంథాల్లో రాసారు. అంటే అర్థం కేవలం ఒక్కడే. ఆయన క్రీస్తే.
\s5
\v 17 నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే దేవుడు అబ్రాహాముతో ఏర్పాటు చేసిన ఒప్పంద వాగ్దానం, అతని తరువాత 430 సంవత్సరాలకు వచ్చిన మోషేకు ఇచ్చిన ధర్మ శాస్త్రం రద్దు చెయ్యలేదు.
\v 18 ఎందుకంటే మనం ఆయన ధర్మ శాస్త్రాన్ని పాటిస్తున్నందువల్ల అది శాశ్వతంగా నిలిచి ఉండే జీవం ఇస్తున్నట్టయితే దేవుడు అలా చేస్తానని అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చి ఉండే వాడు కాదు. అయితే నిజానికి దేవుడు అబ్రాహాముకు ఇస్తానని స్వేచ్ఛగా వాగ్దానం చేశాడు. కాబట్టే దేవుడు అతనికి ఈ బహుమతిని ఇచ్చాడు.
\s5
\p
\v 19 అయితే దేవుడు మనకు ఈ ధర్మశాస్త్రాన్ని ఎందుకని ఇచ్చాడు? మనందరం ఉద్దేశ్యపూర్వకంగానే దాన్ని మీరుతామని మనకు బోధించడానికే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అబ్రాహాము వారసులు వచ్చే సమయానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అబ్రాహాముకు ముందే చేసిన వాగ్దానానికి అర్హత పొందినవాడే ఆ వారసుడు. అతడు వచ్చేవరకూ దేవునికీ, ప్రజలకీ మధ్య ఒక వ్యక్తిలా నిల్చుని దేవదూతలు ధర్మశాస్త్రాన్ని రక్షిస్తూ అమలు పరిచారు.
\v 20 ఒక వ్యక్తి మరో వ్యక్తితో నేరుగా మాట్లాడుతున్నప్పుడు అక్కడ మధ్యవర్తి లేడు. అలాగే దేవుడు తనకు తానుగా అబ్రాహాముతో నేరుగా వాగ్దానాలు చేశాడు.
\s5
\p
\v 21 కాబట్టి దేవుడు స్వయంగా చేసిన వాగ్దానానికి వ్యతిరేకంగా ధర్మశాస్త్రం మాట్లాడుతుందా? ససేమిరా మాట్లాడదు. ఒకవేళ ధర్మశాస్త్రానికి విధేయత చూపిస్తూ దేవునితోబాటు శాశ్వతంగా జీవిస్తుంటే, అప్పుడు కచ్చితంగా ఆయన దృష్టిలో నీతిమంతులుగా మనల్ని భావిస్తాడు.
\v 22 కానీ అది అసాధ్యం. దానికి బదులుగా మనం పాపం చేస్తున్నప్పుడు మనం జైల్లో ఉన్న ఖైదీగా ధర్మశాస్త్రం మనల్ని అన్ని విషయాల్లో నియంత్రిస్తుంది. కాబట్టి ఆ జైలునుండి మనల్ని విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు, ఆయన యేసుక్రీస్తుపై విశ్వాసముంచిన వాళ్ళను గూర్చి మాట్లాడుతున్నాడు.
\s5
\v 23 క్రీస్తులో ప్రజలు ఎలా నమ్మకం ఉంచాలో అనే సువార్తను తెలియజేయక ముందు, మనల్ని జైల్లో ఉంచి ఎటూ కదలడానికి వీల్లేకుండా కాపలా కాసే సైనికుడిలా ధర్మశాస్త్రం ఉంది.
\v 24 తండ్రి తన చిన్న బిడ్డను సంరక్షించడానికి ఏర్పాటు చేసుకున్న సేవకుడితో తన చిన్న బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని చెప్పినట్లుగా, క్రీస్తు వచ్చేదాకా మనల్ని పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిందే ఈ ధర్మశాస్త్రం. మనం క్రీస్తులో విశ్వాసం ఉంచితే, తన దృష్టిలో నీతిమంతులుగా ఇప్పుడు ఆయన ప్రకటించడానికి ఆయన ఇది అంతా చేశాడు.
\v 25 అయితే ఇప్పుడు మనం క్రీస్తులో విశ్వాసం ఉంచాము కాబట్టి ఇక మనపై దేవుని ధర్మశాస్త్ర పర్యవేక్షణ అవసరం లేదు.
\p
\v 26 మీరు యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచినందువల్ల మీరందరూ దేవుని పిల్లలు కాబట్టి నేను ఇది అంతా చెప్తున్నాను.
\s5
\v 27 క్రీస్తులో విశ్వాసం ఉంచిన వారందరూ బాప్తిస్మం తీసుకున్నారు కాబట్టి మీరందరూ ఆయనతో కలిసి పోయారు. కాబట్టి క్రీస్తు జీవితపు వ్యక్తిత్వ లక్షణాలు అలవరుచుకోండి.
\v 28 మీరు విశ్వాసులైతే, మీరు యూదులైనా, యూదేతరులైనా సేవకులైనా యజమాని లేని స్వతంత్రులైనా, మగవారైనా, ఆడవారైనా ఎవరైనా దేవునికి పట్టింపు లేదు. ఎందుకంటే మీరందరూ కలిసి క్రీస్తుతో కలిసి పోయారు.
\v 29 ఇంకా వివరంగా మాట్లాడుకుంటే, మీరు క్రీస్తుకు చెందిన వారు అయినప్పటి నుండీ ఆయన మిమ్మల్ని అబ్రాహాము వారసులుగా చేస్తాడు. తద్వారా దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానాలన్నిటినీ మీరు పొందుతారు.
\s5
\c 4
\p
\v 1 ఇప్పుడు నేను మరింత ముందుకు వెళ్ళి పిల్లలు, వారసులు అంటే ఏమిటో వివరంగా చర్చిస్తాను. వారసుడంటే కుమారుడు. అతడు తన తండ్రికి ఉన్న ఆస్తి మొత్తాన్ని, తండ్రి తదనంతరం స్వాధీనం చేసుకుంటాడు. కానీ ఆ వారసుడు చిన్నపిల్లవానిగా ఉన్నంతకాలం, అతడిని ఒక సేవకుడిలానే ఇతరులు నియంత్రిస్తారు.
\v 2 ఇంతకు ముందే అతడి తండ్రి నిర్ణయించిన రోజు వచ్చేదాకా ఆ చిన్నపిల్లవాడిని ఇతరులు పర్యవేక్షిస్తూ సంరక్షిస్తూ, అతడి ఆస్తిని నిర్వహిస్తూ కాపాడతారు.
\s5
\v 3 ఆవిధంగానే మనం చిన్నపిల్లల్లా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలోని ప్రతిఒక్కరూ జీవిస్తూ, అనుసరిస్తున్న చెడు నియమాల కింద ఉన్నాము. యజమాని తన సేవకులను నియంత్రిస్తున్నట్లుగా ఈ నియమాలు అంటే ధర్మశాస్త్రం మనల్ని నియంత్రించింది.
\p
\v 4 కానీ దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు తన కుమారుడైన యేసును ఈ లోకంలోకి పంపాడు. యేసు ఒక సాధారణ స్త్రీ గర్భం నుంచి పుట్టాడు కాబట్టి ఆయన ఈ లోక సంబంధమైన ధర్మశాస్త్రాన్ని పాటించవలసి వచ్చింది.
\v 5 మనల్ని నియంత్రిస్తున్న ధర్మశాస్త్రం నుంచి రక్షించటానికి దేవుడు యేసును పంపాడు. మనల్ని తన సొంత పిల్లలుగా దత్తత చేసుకోవటానికి దేవుడు ఈ విధంగా చేశాడు.
\s5
\p
\v 6 ఇప్పుడు మీరందరూ దేవుని కుమారులు అయినందువల్ల, మనలో ప్రతి ఒక్కరిలో నివసించడానికి తన కుమారుని ఆత్మను ఆయన మనకు పంపాడు. ఇది దేవుని ఆత్మ కాబట్టి ఒక కుమారుడు తన తండ్రిని తండ్రీ, నాన్నా, నా ప్రియమైన తండ్రీ అంటూ పిలిచే అనుమతి దేవుడు మనకు ఇస్తున్నాడు. ఇదే మనం దేవుని కుమారులమని చూపిస్తుంది.
\v 7 కాబట్టి ఇక మీలో ఎవ్వరూ సేవకుల్లా ఉండకూడదనే దేవుడు ఈ విధంగా చేసాడు. మీలో ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలే. కాబట్టి మీరు దేవుని పిల్లలైనప్పటి నుంచీ, ఆయన తాను ఇస్తానని చేసిన వాగ్దానాలన్నిటినీ దేవుడు ఇస్తాడు. దేవుడే తనకు తానుగా ఇదంతా చేస్తాడు.
\s5
\p
\v 8 మీకు దేవుని గూర్చి తెలియనప్పుడు, నిజంగా ఉనికిలో లేని దేవుళ్ళను మీరు దేవుళ్ళుగా ఆరాధించారు. మీరు వాటికి బానిసలుగా ఉండేవారు.
\v 9 కానీ ఇప్పుడు అసలైన మీరు దేవుణ్ణి తెలుసుకున్నారు. అంతే కాక మీలో ప్రతి ఒక్కరూ దేవునికి తెలుసు అనడం సబబుగా ఉంటుంది. అయితే ఎందుకని మీరు మళ్ళీ వెనుకకు తిరిగి బలహీనమైనవీపనికిమాలినవీ అయిన ఈ లోక నియమాలను అనుసరిస్తున్నారు? మళ్ళీ మీరందరూ వాటి సేవకులుగా, బానిసలుగా మారాలని చూడడం లేదు కదా.
\s5
\p
\v 10 అయితే చూడడానికి మీరు ఆ విధంగా కోరుకుంటున్నట్టు కనిపిస్తున్నది. గతంలో ఇతరులు మీరు ఏమైతే చేయడం లేదని మిమ్మల్ని అవమానించారో, అంటే సంవత్సరాలు, నెలలు, ఋతువులు, ముహూర్తాలు అని చెప్పుకొంటున్న వాటిని మళ్ళీ మీరు అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
\v 11 నేను మీగురించి పుట్టెడు దుఃఖంతో ఉన్నాను. నేను మీ కోసం ఎంతో చెమటోడ్చాను. కానీ ఇప్పుడు ఇదంతా బూడిదలో పోసిన పన్నీరు లాగా తోస్తున్నది.
\s5
\v 12 నా తోటి విశ్వాసులారా, నాలాగా మారమని మిమ్మల్ని గట్టిగా వేడుకుంటున్నాను. ఎందుకంటే నన్ను ధర్మశాస్త్రం అదుపులో ఉంచుకునేందుకు ససేమిరా ఒప్పుకోను. ఈ ధర్మశాస్త్రం నుంచి నేను విడుదలైనప్పుడు, నేను మీలాంటి యూదేతరుడనయ్యాను. కాబట్టి మీరు కూడా ఇప్పుడు మళ్ళీ ఆరాధిస్తున్న దేవుళ్ళ నుంచి బయట పడండి. నేను మొదట మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు, మీరు నాకు ఎలాటి ఇబ్బంది, హాని కలిగించలేదు. కానీ ఇప్పుడు మీ గురించి దిగులు పడేలా చేస్తున్నారు.
\p
\v 13 నేను మొదటిసారి మీకు సువార్తను చెప్పినప్పుడు అనారోగ్యంతో ఉన్న సబ్గతి గుర్తుకు తెచ్చుకోండి.
\v 14 నేను అనారోగ్యంగా ఉన్న కారణంగా మీరు నన్ను నిర్లక్ష్యం చేయవచ్చు. కానీ మీరు నన్ను నిర్లక్ష్యం చేయలేదు. పైగా నన్ను దేవుని దగ్గరనుండి వచ్చిన దేవదూతనన్నట్టు స్వాగతించారు. యేసు క్రీస్తును స్వాగతించినట్టుగా నన్ను స్వాగతించారు.
\s5
\p
\v 15 అయితే ఇప్పుడు ఆ సంతోషమంతా ఏమైపోయింది? మీరు నాకు సహాయం చేయడానికి కొండమీది కోతినైనా తేగలరని నాకు కచ్చితంగా తెలుసు. నాకు అవసరం అనుకుంటే మీ కళ్ళు సైతం పీకి ఇచ్చేవారే.
\p
\v 16 ఈ కారణం చేత నేనెంతో చింతిస్తున్నాను. నేను మీకు క్రీస్తుని గూర్చిన నిజాన్ని చెప్పడం కొనసాగిస్తూ ఉన్నందువల్ల, నేను మీకు శత్రువునైనట్టు ఆలోచిస్తున్నారా ఏమిటి?
\s5
\v 17 యూదా ధర్మశాస్త్రాన్ని పాటించాలని మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్న వాళ్ళు మీరు తమను అనుసరించేలా ప్రయత్నిస్తున్నారు. కానీ వారు ఇలా చేస్తున్నది మీ మంచి కోసం కాదు. నానుంచి వేరు చేయాలనేదే వారి కోరిక. ఎందుకంటే మీరు నన్ను కాకుండా వాళ్ళను అనుసరించాలని వారి దురుద్దేశం.
\v 18 సరే, మంచి పనులు చేయడానికి ఒత్తిడి చేస్తే మంచిదే. అయితే ఏం చేయాలో మీకు బోధిస్తున్న వాళ్ళు సరైన వ్యక్తులో కాదో ముందు నిర్ధారించుకోండి. నేను మీతో ఉన్నప్పుడే కాకుండా, లేనప్పుడు కూడా అస్తమానం ఇలా చేయండి.
\s5
\p
\v 19 మీరు నా పిల్లల వంటి వారు. కాబట్టి మళ్ళీ మీగూర్చి నేను వ్యాకులపడుతున్నాను. మీరు క్రీస్తులా మారేంతవరకూ ఇలాగే మీగూర్చి బాధ పడుతుంటాను.
\v 20 అంతేకాక ఇప్పుడు మీతోపాటు అక్కడ ఉండి మరింత సున్నితంగా మాట్లాడాలని ఉంది. ఎందుకంటే మీ గూర్చి ఇప్పుడు ఏం చేయాలో నాకు తోచడం లేదు.
\s5
\p
\v 21 మళ్ళీ ఈ విషయాలను గూర్చి ఇంకా వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. దేవుని ధర్మశాస్త్రం లోని అన్ని నియమాలకూ లోబడాలని మీలో కొందరు కోరుకుంటున్నారు. అయితే ధర్మశాస్త్రం ఏం చెబుతున్నదో మీరు నిజంగా శ్రద్ధగా గమనిస్తున్నారా?
\v 22 ధర్మశాస్త్రంలో అబ్రాహాము ఇద్దరు పిల్లలకు తండ్రి అని మనం చదువుతాము. తన దాసీ హాగరు ఒక కుమారుడికి జన్మనిస్తే, అతడి భార్య శారా మరో కుమారుడికి జన్మనిచ్చింది. ఈమె బానిస, దాసీ కాదు.
\v 23 దాసీ అయిన హాగరుకు పుట్టిన ఇష్మాయేలు పుట్టుక సాధారణమైనదే. కానీ సేవకురాలు కాని శారానుండి జన్మించిన ఇస్సాకు పుట్టుక అద్భుతం. ఎందుకంటే కుమారుణ్ణి ఇస్తానని దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసాడు.
\s5
\p
\v 24 ఇప్పుడు ఈ ఇద్దరు స్త్రీలు రెండు ఒప్పందాలకు గుర్తులు. సీనాయి పర్వతం వద్ద ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మొదటి నిబంధన చేశాడు. ఈ నిబంధన ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రానికి సేవకుల్లా జీవించాలి. కాబట్టి హాగరు అనే దాసీ ఈ నిబంధనకు గుర్తు.
\v 25 అంటే హాగరు అరేబియా దేశంలోని సీనాయి పర్వతానికి గుర్తు. అంతే కాకుండా ఈనాటి యెరూషలేము నగరానికి కూడా హాగరు గుర్తుగా ఉంది. అలా ఎందుకంటే యెరూషలేము బానిసత్వంలో ఉన్న తల్లిలా ఉంది. ఆమె, ఆమె పిల్లలూ అంటే ఆ ప్రజలందరూ బానిసల్లాంటి వారే. ఎందుకంటే సీనాయి పర్వతం వద్ద ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రానికి వాళ్ళందరూ విధేయత చూపించాలి.
\s5
\p
\v 26 అయితే పైనున్న పరలోకంలో కొత్త యెరూషలేము ఉంది. ఆ నగరం క్రీస్తులో విశ్వాసముంచిన వాళ్ళందరికీ తల్లి లాంటిది. ఆ నగరంలో పూర్తి స్వేచ్ఛ ఉంది.
\v 27 పాత యెరూషలేము కంటే కొత్త యెరూషలేములో ఎక్కువమంది ప్రజలు ఉంటారు. ఎందుకంటే యెషయా ప్రవక్త రాశాడు గదా.
\q "యెరూషలేము నివాసులారా ఉప్పొంగి పొండి.
\q ఇప్పుడు పిల్లలు కనలేని స్త్రీ వలే
\q నిస్సంతుగా ఉన్నావు.
\q కానీ ఒక రోజు నీవు సంతోషంతో కేరింతాలు కొడతారు.
\q ఇపుడు మీకు పిల్లలు లేనప్పటికీ పిల్లలను కనలేని గొడ్రాలు లాగా దిక్కులేనట్టుగా ఉన్నప్పటికీ
\q నీకు గంపెడు సంతానం కలుగుతుంది.
\q భర్తతో కాపురం చేసే ఏ మహిళా కూడా కనలేనంతమంది."
\s5
\p
\v 28 నా తోటి విశ్వాసులారా, ఇప్పుడు మీరు దేవుని పిల్లలు అయ్యారు. ఎందుకంటే దేవుడు ఇస్తానని వాగ్దానం చేసిన దాన్ని మీరు విశ్వసించారు. మీరు దేవుడు చేసిన వాగ్దానాన్ని విశ్వసించిన అబ్రాహాముకు పుట్టిన ఇస్సాకు వంటి వారు.
\v 29 కానీ అంతకు ముందే శారీరికంగా పుట్టిన అబ్రాహాము కుమారుడు ఇష్మాయేలు. అతడు పరిశుద్దాత్మ కార్యం ద్వారా జన్మించిన ఇస్సాకును వేధించాడు. ఇప్పుడూ అలానే జరుగుతోంది. దేవుని ధర్మశాస్త్రానికి బానిసలైన ప్రజలు, క్రీస్తు చేసిన వాగ్దానం నమ్మిన మనల్ని హింసిస్తున్నారు.
\s5
\p
\v 30 కానీ గ్రంధాల్లో ఈ మాటలు ఉన్నాయి. బానిస కాక స్వతంత్రంగా ఉన్న స్త్రీకీ పుట్టిన వాడే తన తండ్రికి వారసుడు. బానిస కుమారుడికి ఎలాటి వారసత్వపు హక్కులూ లేవు. కాబట్టి ఆమెను, ఆమె కుమారుడినీ ఈ ప్రదేశం నుండి దూరంగా పంపి వేయండి.
\v 31 నాతోటి విశ్వాసులారా, మనం ఆ బానిస స్త్రీకి పుట్టిన వాళ్ళం కాము. మనం స్వేచ్ఛ గా ఉన్న స్త్రీకి పుట్టిన పిల్లలం.
\s5
\c 5
\p
\v 1 క్రీస్తు మనల్ని ధర్మశాస్త్రం నుంచి విడిపించాడు కాబట్టి ఇక ధర్మశాస్త్రం ఎంతమాత్రం మనల్ని నియంత్రించలేదు. మిమ్మల్ని ఎవరైనా ధర్మశాస్త్రానికి మీరు బానిసలే అంటే వాళ్ళని వారించండి. ఇక ధర్మశాస్త్రం మిమ్మల్ని బానిసల్లా నియంత్రించనివ్వకండి.
\v 2 అపోస్తలుడైన పౌలు అను నేను ఇప్పుడు మీకు చెబుతున్న దానిని చాలా జాగ్రత్తగా పరిగణలోనికి తీసుకోండి. మీకు సున్నతి చేయడానికి మీరు ఎవరికైనా అవకాశం ఇస్తే, మీకోసం క్రీస్తు చేసినది మీకు ఏమాత్రం సహాయ పడదు.
\s5
\v 3 సున్నతి చేసుకున్న ప్రతి మనిషికీ నేను గంభీరమైన స్వరంతో ప్రకటిస్తున్నది ఏంటంటే దేవుని దృష్టిలో అతడు నీతిమంతుడిగా ప్రకటించాలి, అంటే అతడు ధర్మశాస్త్రాన్ని పూర్తి విధేయుడై పాటించాలి.
\v 4 మీరు ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ప్రయత్నిస్తున్నందున, దేవుడు మిమ్మల్ని తన దృష్టిలో నీతిమంతులుగా ప్రకటించాలని మీరు ఆశిస్తున్నట్లైతే, మీరు క్రీస్తులో నుంచి మిమ్మల్ని మీరు వేరు చేసుకున్నట్లే. దేవుడు ఇకపై మీపట్ల ఎంతమాత్రమూ దయగా నడుచుకోడు.
\s5
\v 5 మనం క్రీస్తులో విశ్వసించడానికి దేవుని ఆత్మ వీలు కల్పిస్తుంది. అందువల్ల మనమందరం దేవుడు మనల్ని నీతిమంతులుగా ప్రకటించే రోజు కోసం ఆత్మా విశ్వాసంతో నమ్మకంతో ఎదురు చూస్తున్నాము.
\v 6 మనకు సున్నతి ఉందా, లేదా అనే దానిని గూర్చి దేవుడు ఎంతమాత్రం ఆందోళన పడదు. మనం క్రీస్తులో నమ్మకం ఉంచామా లేదా అనే దాన్ని గూర్చే దేవుడు ఆందోళన చెందుతున్నాడు. క్రీస్తులో నమ్మకం వుంచడం ఫలితంగా మనం ఇతరులను ప్రేమిస్తున్నాము. ఎందుకంటే మనం ఆయనలో నమ్మిక ఉంచిన వారం కాబట్టి.
\p
\v 7 మీరు చాలా బాగా క్రీస్తును వెంబడిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయన నిజమైన సందేశాన్ని పాటించకుండా, మిమ్మల్ని ఆపిందెవరు?
\v 8 ఈ విధంగా మిమ్మల్ని ఆలోచించమని ఒప్పించినది మిమ్మల్ని ఎంచుకున్న దేవుడు కాదు.
\s5
\v 9 కొద్దిగా పులిసిన పదార్ధం రొట్టెల ముద్దనంతా పొంగచేస్తున్నట్లుగా, కొంతమంది బోధిస్తున్న ఈ తప్పుడు బోధలు మీ అందరికీ వ్యాపింపచేసే ప్రమాదముంది.
\v 10 మన ప్రభువైన యేసు, తన సత్య సువార్తను తప్ప మిగతాది మరేదైనా మిమ్మల్ని నమ్మకుండా చేస్తాడని నాకు కచ్చితంగా తెలుసు. ఈ తప్పుడు సందేశాన్ని బోధిస్తూ మిమ్మల్ని గందరగోళం చేస్తున్నది ఎవరైనా సరే, దేవుడు వాళ్ళని తప్పక శిక్షిస్తాడు.
\s5
\p
\v 11 కానీ నా తోటి విశ్వాసులారా, మీరు సున్నతి పొందాలని నేను ఇప్పటికీ బోధిస్తున్నట్టుగాఎవరైనా మీకు చెబుతున్నారా? నేను క్రీస్తును వెంబడించక మునుపు అలా బోధించినమాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఎంతమాత్రం ఆ విధంగా బోధించడం లేదు. వాళ్ళు నా గూర్చి చెబుతున్నది నిజం కాదు. అలా కాకుంటే ఇప్పుడు నన్ను ఎవరూ ఈ విధంగా హింస పెట్టేవారు కాదు కదా. నేను చెప్పేది ఏమిటంటే, క్రీస్తును వెంబడించాలంటే సున్నతి పొందాలని ఎవరన్నా ఆలోచిస్తే, ఇక క్రీస్తు సిలువపై మరణించడం వల్ల వచ్చిన లాభం ఏమిటి?
\v 12 మిమ్మల్ని గందరగోళ పరుస్తున్న వారు తమకు తాముగా అంగాన్ని నరికేసుకోవాలి!
\s5
\p
\v 13 నాతోటి విశ్వాసులారా, మిమ్మల్ని స్వతంత్రులుగా చేయడానికి దేవుడు పిలిచాడు. అయితే దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసింది మీరు యధేచ్చగా పాపం చేయడానికి అనుకోకండి. దీనికి బదులుగా ఒకరినొకరు ప్రేమిస్తూ, సహాయం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇలా చేయడానికి స్వతంత్రులు.
\v 14 యేసు ప్రభువు ఏం చెప్పాడో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టే ప్రతి ఒక్కరినీ ప్రేమించండి అనే వాక్యంలోనే ధర్మశాస్త్రం మొత్తం అర్థం ఉంది, అని ఆయన చెప్పాడు.
\v 15 అడవి జంతువుల్లా మీరు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ, హాని చేసుకుంటూ పోతే, మీరు ఒకరినొకరు పూర్తిగా నాశనం చేసుకుంటారు.
\s5
\p
\v 16 కాబట్టి నేను మీకు చెప్పేదేమిటంటే, ఎప్పుడూ దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపించ నివ్వండి, మీరు ఇలా చేస్తే, అంటే దేవుని ఆత్మ నడిపింపులో ఉంటే, మీరు చేయాలనుకొనే పాపకృత్యాలు చేయరు.
\v 17 మీరు ఎప్పుడైతే పాపం చేయాలనుకుంటారో అప్పుడు దేవుని ఆత్మకు వ్యతిరేకంగా వెళుతున్నారు. దేవుని ఆత్మ మీ పాపపు కోరికలకు వ్యతిరేకం. ఈ రెండూ ఎప్పుడూ ఒక దానితో ఒకటి వ్యతిరేకంగా పోరాటం చేస్తాయి. ఫలితంగా మీరు నిజంగా చేయాలని కోరుకునే మంచి పనులు మీరు ఎప్పుడూ చేయలేరు.
\v 18 అయితే దేవుని ఆత్మ నడిపిస్తున్నప్పుడు, ధర్మశాస్త్రం మిమ్మల్ని నియంత్రించలేదు.
\s5
\p
\v 19 పాపాన్ని గుర్తించడం చాలా సులభం. ఈ పాపాత్ములు అనైతికమైన లైంగిక చర్యలకు పాల్పడతారు. ఇవి సహజమైన పద్ధతికి వేరుగా విపరీతమైనవిగా ఉంటాయి. వాళ్ళు ఆశించేవి చట్టవిరుద్ధంగా ఉంటాయి.
\v 20 వాళ్ళు అబద్ద దేవుళ్ళను ఆరాధిస్తారు. ఆ దేవుళ్ళను సూచించే వస్తువులను కూడా ఆరాధిస్తారు. తమ కోసం పనిచేయడానికి దుష్ట శక్తులను వశం చేసుకోడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఆ మనుషులు ఇతరులకు విరోధంగా ఉంటారు. ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారు. వాళ్ళు అసూయపరులు, కోపోద్రిక్తులు. ఇతరులకంటే తమను గొప్పవారిగా భావిస్తూ, ఎదుటి వాళ్ళు తమను అలా ఎంచాలని ప్రయత్నిస్తారు. ఎదుటి వాళ్ళు కోరుకునేది లెక్క చెయ్యరు. ఈ మనుషులు ఇతరులతో కలవరు. తమతో ఏకీభవించే వాళ్ళతోనే కలుస్తారు.
\v 21 ఎదుటి వాళ్లకి ఉన్నది తమది కావాలని కోరుకుంటారు. ఈ మనుషులు తాగుబోతులు. తాగి అల్లర్లు చేస్తారు. ఈ విధంగానే అందరూ ఆలోచించేలా చేస్తారు. కాబట్టి ఇంతకు మునుపు హెచ్చరించినట్టేలే ఇప్పుడు మళ్ళీ హెచ్చరిస్తున్నాను. ఇలాటి పాతకాలను నిరంతరం ఆలోచిస్తూ, దాన్నే చేస్తూ ఉండేవారు దేవుడు రాబోయే కాలంలో తనను రాజుగా వెల్లడి పరుచుకునేటప్పుడు తన ప్రజల కోసం ఏర్పాటు చేసిన దాన్ని వాళ్ళు పొందలేరు.
\s5
\p
\v 22 అయితే క్రీస్తులో నమ్మకం పెంపారుతున్న కొద్దీ, మనం ఇతరులను ప్రేమించేలా దేవుని ఆత్మ మనపై ప్రభావం చూపుతాడు. మనం ఆనంద భరితులం, శాంతి కాముకులం, సహనశీలురం, దయామయులం, మంచి వాళ్ళం, ఇతరులు ఆధారపడదగిన వాళ్ళం.
\v 23 మనం సున్నితమనస్కులం. ప్రవర్తన అదుపులో ఉంచుకునే వాళ్ళం. ఈ వాలకానికీ పద్ధతికీ వ్యతిరేకమైన నియమం ఏదీ లేదు.
\v 24 అంతేకాక ఇప్పుడు క్రీస్తుకు చెందిన మనం గతంలో చేసిన ఈ చెడ్డ పనులు ఇప్పుడు చేయకుండా అదుపు చేసుకునే విధంగా యేసు క్రీస్తు ప్రభువు చేశాడు. మనం వాటిని సిలువకు మేకులతో కొట్టి వధించినట్టు అయింది.
\s5
\p
\v 25 మనం కొత్త మార్గంలో జీవించడానికి దేవుని ఆత్మ మనకు వీలు కల్పిస్తున్నప్పటి నుండీ దేవుని ఆత్మ నడిపింపులో మనం ప్రవర్తించాలి.
\v 26 స్వాతిశయం పనికి రాదు. ఒకరినొకరు కోపం రేపుకోకూడదు. అసూయ పడరాదు.
\s5
\c 6
\p
\v 1 నా తోటి విశ్వాసులారా, మన సోదరసోరీల్లో ఎవరన్నా తప్పు చేస్తున్నట్లుగా కనిపిస్తే దేవుని పరిశుద్దాత్మ నడిపింపులో ఉన్న మీరు వాళ్ళను సున్నితంగా గద్దించి సరిదిద్దాలి. ఇంకా చెప్పాలంటే, మీరు ఇతరులను సరిదిద్దుతున్నప్పుడు ముందుగా అసలు మీరు పాపంలో పడతారేమో జాగ్రత్తగా చూసుకోవాలి.
\v 2 అలాగే మన సోదరుడైనా సోదరైనా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఒకరి కొకరు సహాయ పడాలి. ఆవిధంగా చేయడం ద్వారా మీరు క్రీస్తు ఆజ్ఞలను పాటిస్తున్న వారౌతారు.
\s5
\v 3 నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే తమను తాము గొప్ప వాళ్ళుగా ఆలోచించే వాళ్ళు కేవలం అవివేకులు.
\v 4 ప్రతి ఒక్కరూ తమను తాము నిరంతరం పరీక్షించుకోండి. మీరు ఆలోచిస్తున్న, చేస్తున్న పనులు అసలు మీకు ఆమోదయోగ్యంగా ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోండి. మీకు మీరుగా చేసిన మంచి పనులను బట్టి గర్వపడవచ్చు. అంతే కానీ మరెవరో చేసినదానికన్నా నేను చేసినది బాగా ఉంది అని గర్వ పడటం మంచిది కాదు.
\v 5 నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీలో ప్రతిఒక్కరూ మీ వ్యక్తిగతమైన పనులను మీరే సొంతంగా చేయాలి.
\s5
\p
\v 6 మీ తోటి విశ్వాసులు మీకు దేవుని గూర్చిన సత్యాన్ని బోధించినప్పుడు మీరు మీకున్న వాటిని వారితో పంచుకోవాలి.
\v 7 మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఎవరూ దేవుణ్ణి మోసం చేయలేరు అని గుర్తు పెట్టుకోండి. ఒక రైతు ఎలాంటి విత్తనాలు చల్లాడో ఆ పంటనే పొందినట్టుగా, దేవుడు కూడా మనుషులు చేసిన పనుల ప్రకారమే వాళ్లకు తిరిగి ప్రతిఫలం ఇస్తాడు.
\v 8 తెలిసీ కావాలని పాపం చేసిన వాళ్ళకు దేవుడు నిత్య నరకాగ్నిని శిక్షగా విధిస్తాడు. కానీ దేవుని పరిశుద్ధాత్మను సంతోషపరిచేలా నడుచుకున్న వాళ్ళు దేవునితోపాటు నిత్యం జీవిస్తారు. ఎందుకంటే వాళ్ళు దేవుని పరిశుద్దాత్మ తమకు చెప్పినట్టుగా నడుచుకున్నారు.
\s5
\v 9 అయితే మనం దేవునికి నచ్చినదాన్ని అలిసిపోకుండా చేస్తుండాలి. ఎందుకంటే మనం చేస్తున్న మంచి పనులు ఎడతెగక చేస్తున్నట్లయితే చివరకు దేవుడు నిర్ణయించిన సమయంలో దానికి తగిన ప్రతిఫలం మనం పొందుతాము.
\v 10 కాబట్టి మనకు అవకాశం ఉన్నప్పుడల్లా ప్రజలందరికీ ఏది మంచిదో అది చేయాలి. ముఖ్యంగా మన తోటి విశ్వాసులకు తగినంత సహాయం చేయాలి.
\s5
\p
\v 11 ఈ లేఖలో ఈ చివరి భాగాన్ని నా సొంత చేతులతో రాస్తున్నాను. నా రాతలోని పెద్ద అక్షరాలను మీరు గమనించవచ్చు.
\v 12 కొంతమంది యూదు విశ్వాసులు మీకు సున్నతి చేయించాలని కోరుకుంటున్నారు. మిమ్మల్ని యూదు మతంలోకి మార్చామని ఇతర యూదులు వాళ్ళను గూర్చి గొప్పగా చెప్పుకోవాలని భావిస్తున్నారు. కానీ నిజానికి వాళ్ళు క్రీస్తు సిలువమీద మరణించాడని విశ్వసించిన తమ విశ్వాసాన్ని బట్టి ఇతరులు వాళ్ళని హింసించకుండా చూసుకోవడం కోసమే వాళ్ళు ఇలా చేస్తున్నారు.
\p
\v 13 నేను ఇది చెప్పడానికి కారణం ఏమిటంటే అలా చేస్తున్న మనుషులు కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించరు. అయినా కూడా వాళ్ళు మీకు సున్నతి చేయాలని చూస్తున్నారు. తాము యూదా మత విశ్వాసంలోకి ఎక్కువ మందిని మార్చామని ప్రగల్భాలు చెప్పుకోవడానికే ఇదంతా.
\s5
\v 14 అయినప్పటికీ నాకు నేనుగా దేన్నిగురించీ ఆ విధంగా ప్రగల్భాలు చెప్పుకోకూడదని గట్టి పట్టుదలతో ఉన్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు గురించీ ఆయన సిలువపై చేసిన బలియాగం గురించీ మాత్రమే నేను గర్వ పడతాను. ఆయన సిలువమీద మరణించినప్పుడే అవిశ్వాసుల కోర్కెలన్నింటినీ నా దృష్టిలో విలువ లేనట్లుగా ఆయన మార్చి వేసాడు. నా కోరికలన్నీ వాళ్ళ దృష్టిలో ఏ విలువా లేనట్లుగా ఆయన చేశాడు.
\v 15 ఎందుకంటే మనుషులు సున్నతి పొందారా లేదా అనేదాన్ని దేవుడు లెక్కచేయడు. వాళ్ళను కొత్త మనుషులుగా మార్చడానికే ఆయన ప్రాధాన్యత ఇస్తాడు.
\v 16 ఇలా జీవిస్తున్న వారందరి పట్లా దేవుడు దయగా వ్యవహరిస్తూ, శాంతిని ఇచ్చు గాక. దేవునికి చెందిన ఈ నిజమైన ఇశ్రాయేలు జాతి ఇటువంటి విశ్వాసులదే.
\s5
\p
\v 17 నేను చెప్పేది ఏమిటంటే యేసును గూర్చిన సత్యాన్ని ప్రకటిస్తున్నందువల్ల మనుషులు నన్ను ఎంతో హింసించారు. దాని ఫలితంగా మీ కొత్త బోధకుల్లాగా కాకుండా, నా శరీరంపై ఎన్నో గాయాల మచ్చలు అలానే ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలను గూర్చి ఎవ్వరూ నన్ను మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్ట వద్దు.
\p
\v 18 నా తోటి విశ్వాసులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ క్షేమం కలగజేయును గాక. ఆమేన్.