Door43-Catalog_te_iev/57-TIT.usfm

100 lines
23 KiB
Plaintext

\id TIT - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h తీతుకు రాసిన పత్రిక
\toc1 తీతుకు రాసిన పత్రిక
\toc2 తీతుకు రాసిన పత్రిక
\toc3 tit
\mt1 తీతుకు రాసిన పత్రిక
\s5
\c 1
\p
\v 1 తీతూ, యేసు అపోస్తలుణ్ణి, దేవుని సేవకుణ్ణి అయిన పౌలు అనే నేను ఈ ఉత్తరం రాస్తున్నాను. తన వారినిగా దేవుడు ఎన్నిక చేసుకున్నవారు ఆయనను మరింతగా నమ్మేలా బోధించడానికి ఆయన నన్ను పంపాడు. ఆయన ప్రజలు సత్యం తెలుసుకునేలా సాయపడడమే నా పని. తద్వారా వారు దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా జీవించగలుగుతారు.
\v 2 ఇలా జీవించడం ఎలాగో ఆయన ప్రజలు నేర్చుకుంటారు. ఎందుకంటే దేవుడు వారిని నిత్యం జీవింప చేయగలడన్న నమ్మకం వారికి ఉంది. దేవుడు అబద్ధం ఆడడు. ఆయన భూమి పుట్టకమునుపే మనకు నిత్యజీవాన్ని గురించిన వాగ్దానం చేశాడు.
\v 3 తగిన సమయంలో ఆయన తన ఏర్పాటును నమ్మకంతో నాకప్పగించిన ఈ సువార్త సందేశం ద్వారా తెలియజేశాడు. మనల్ని రక్షించిన దేవుని అజ్ఞాపాలనలో భాగంగా నేను ఇది చేశాను.
\s5
\p
\v 4 తీతూ, నువ్వు నా కొడుకులాంటి వాడివి గనక నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వూ నేనూ యేసుక్రీస్తుపైనే నమ్మకం పెట్టుకున్నాం. మనల్ని రక్షించే తండ్రియైన దేవుడూ, యేసుక్రీస్తూ నీకు తన దయా, మనసులో నెమ్మదీ నిత్యమూ దయ చేస్తాడు గాక.
\v 5 ఈ కారణం చేతనే నిన్నుక్రేతు లంకలో విడిచి వచ్చాను. నేను నీతో చెప్పినట్టుగా ఇంకా మిగిలిపోయిన పని పూర్తి చేయడమే గాక ప్రతి పట్టణంలోనూ విశ్వాసుల సంఘాల్లో పెద్దలను నియమించు.
\s5
\p
\v 6 ఈ పెద్దలు ఎవ్వరి చేతా వేలెత్తి చూపించుకోని వారై వుండాలి. ఏకపత్నీవ్రతులై ఉండాలి. వారి పిల్లలకు దేవునిపై విశ్వాసం ఉండాలి. చుట్టుపక్కల వారితో పోకిరీ వాళ్ళనీ, మాట విననివాళ్ళనీ అనిపించుకోకూడదు.
\v 7 దేవుని ప్రజలను నడిపించే ప్రతివాడు దేవుని ఇంటి నిర్వాహకుడు వంటివాడు. అందువలన అలాటివాడు కచ్చితంగా మంచి పేరు తెచ్చుకున్న వాడై వుండాలి. అతడు పొగరుబోతులాగా, ముక్కోపిగా ఉండకూడదు. తాగుబోతుగా గానీ, గిల్లికజ్జాలు, వాదనలు పెట్టుకునే వాడిగా గానీ దురాశాపరుడిగా గానీ అస్సలు ఉండకూడదు.
\s5
\v 8 ముఖ్యంగా కొత్త వారిపట్ల మర్యాదగా, మంచి విషయాలను ఇష్టపడే వాడుగా ఉండాలి. ఇంగితజ్ఞానం గలిగి, ఇతరుల పట్ల నిజాయితీగా, న్యాయంగా నడుచుకోవాలి. అతడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ దైవభక్తుడు ప్రవర్తించాల్సిన సరైన విధానంలో ప్రవర్తిస్తూ వుండాలి.
\v 9 మనం నేర్పిన సత్యాలను ఎప్పుడూ నమ్మకంగా అనుసరిస్తూ ఉండాలి. ఇలా జీవించడం వల్ల ఇతరులను సైతం ఇలాంటి జీవిత క్రమాన్ని అనుసరించేలా సిద్ధం చేయగలుగుతాడు. పైగా ఎవరైనా దారి తప్పుతుంటే సరి చేయగలుగుతాడు.
\s5
\p
\v 10 ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, తమ పెద్దలను వ్యతిరేకిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చెబుతున్న మాటలు ఎందుకూ పనికిరానివి. పైగా వాళ్ళు తమతో ఉన్నవాళ్ళను తప్పుదారి పట్టిస్తారు. ఇలాటి వాళ్ళలో ఎక్కువమంది చెప్పేదేమిటంటే, క్రీస్తును వెంబడించే ప్రతీ ఒక్కరూ సున్నతి పొందాలని!
\v 11 నువ్వూ, నువ్వు నియమించిన పెద్దలూ ఇలాంటి వారిని విశ్వాసులకు బోధించకుండా కట్టడి చేయాలి. వారు బోధించకూడని విషయాలు బోధిస్తూ మొత్తంగా కుటుంబాలనే పాడు చేస్తున్నారు. విశ్వాసులిచ్చే కానుకల కోసమే వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఇది చాలా సిగ్గుచేటు.
\s5
\p
\v 12 క్రేతీయుల ప్రవక్త ఒకడు తమ వాళ్ళని గురించి "క్రేతువాళ్ళు ఎంతసేపూ ఒకరితో ఒకరు అబద్ధాలాడుకుంటారు. వాళ్ళు ప్రమాదకరమైన అడవి జంతువుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు బద్దకస్తులు, తిండిబోతులు" అన్నాడు.
\v 13 అతడు చెప్పేది నిజమే. అందుకే బలవంతంగానైనా సరే, వాళ్ళను సరిదిద్దుతూ వారు దేవుని సత్యాలను నమ్ముతూ బోధించేలా చెయ్యి.
\v 14 వాళ్ళు యూదుల కాకమ్మ కథలపై ఆధారపడడం మానుకోవాలి. సత్యం నుండి తొలిగిపోయిన వాళ్ళు చెప్పుకొస్తున్న ఆజ్ఞలను అనుసరించడం మానెయ్యాలి.
\s5
\p
\v 15 ఎవరిలోనైతే చెడ్డ ఆలోచనలు, లేక కోరికలు ఉండవో ఆలాంటి వాళ్ళకు అంతా మంచే జరుగుతుంది. కానీ క్రీస్తు యేసును నమ్మకుండా అవినీతిలో ఉన్న వాళ్ళు చేస్తున్నది ఏదైనప్పటికీ అది వాళ్ళని అపవిత్రులుగా చేస్తుంది. వాళ్ళ ఆలోచనా విధానం చెడిపోయింది. వాళ్ళు చెడు చేసి కూడా కొంచెమైనా అపరాధ భావం లేకుండా ఉంటారు.
\v 16 దేవుడు మాకు తెలుసని వారు చెప్పుకున్నప్పటికీ వారి క్రియలే దేవుడు వారికి తెలియదని ఎత్తి చూపుతున్నాయి. వాళ్ళని చూస్తేనే చీదర. వాళ్ళు ఎప్పుడూ తిరగబడే స్వభావం గలవాళ్ళు. దేవుడి కోసం ఏ మంచి పనికీ వాళ్ళు పూనుకోరు.
\s5
\c 2
\p
\v 1 తీతూ, నువ్వు మాత్రం దేవుని గురించిన సత్యాన్ని నమ్మిన ప్రజలు ఎలాటి ప్రవర్తన కలిగి జీవించాలో తప్పక బోధించాలి.
\v 2 అన్ని సమయాల్లో తమని తాము అదుపులో పెట్టుకుంటూ ఉండాలని ముసలివాళ్లైన మగవాళ్ళకు చెప్పు. అలా తమ పొరుగు వారందరి గౌరవం పొందుతూ వాళ్ళు జీవించాలి. వాళ్ళు బుద్ధిగా ప్రవర్తించాలి. దేవుని సత్యానికి సంబంధించిన విషయాలను వాళ్ళు స్థిరంగా నమ్మాలనీ, కల్లాకపటం లేని ప్రేమ చూపుతూ ఉండాలనీ చెప్పు. ఇవన్నీ ఎంత కష్టమైనప్పటికీ తప్పక చేయాలని చెప్పు.
\s5
\p
\v 3 అలానే వృద్దురాళ్ళు కూడా దేవుని పట్ల తమ విధేయత అందరూ తెలుసుకొనేలా జీవించాలి. వారు ఇరుగుపొరుగుపై పుకార్లు పుట్టించే వాళ్ళు కాకూడదని చెప్పు, వాళ్ళకి తాగుడు అలవాటు ఉండకూడదు. దానికి బదులు మేలైన విషయాలను ఇతరులకు నేర్పించే వాళ్లుగా వాళ్ళు ఉండాలి.
\v 4 ఇలా ఉండడంవల్ల యువతులు తమ భర్తలను, పిల్లలను ఎలా ప్రేమించాలో దారి చూపగలుగుతారు.
\v 5 యువతులకు తమ మాటలు, చేతలు అదుపులో ఉంచుకోవడం ముసలివాళ్ళు నేర్పించాలి. మగవాళ్ళ విషయంలో తప్పుగా ప్రవర్తింపక శీలవతులుగా ఉండాలి. చక్కగా ఇంటిపని చక్కబెట్టుకుంటూ తమ భర్తలకు అనుకూలంగా నడుచుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల దేవుని సువార్తకు మనవల్ల చెడ్డపేరు రాకుండా ఉంటుంది.
\s5
\p
\v 6 యువకులు కూడా ఇలాగే తమను తాము అదుపులో ఉంచుకోవాలని ఆదేశించు.
\v 7 నీకు నువ్వుగా మంచి విషయాలను క్రమం తప్పకుండా చేయడం వలన ఇతరులు కూడా నిన్ను చూసి తాము ఏమి చేయాలో తెలుసుకుంటారు. నువ్వు విశ్వాసులకు బోధించేటప్పుడు ఎదుటివారు నిన్ను గౌరవించేలా నిజాలే మాట్లాడు.
\v 8 ఎవరూ విమర్శించడానికి వీలు లేనివిధంగా నీ బోధల ద్వారా సత్యం బోధించు, తద్వారా ఎవరైనా నిన్ను ఆపాలని ప్రయత్నిస్తే మిగిలినవాళ్ళు మనలో ఏ తప్పూ లేదని వాళ్ళని వారించడం ద్వారా వాళ్ళు సిగ్గు పడేలా చేస్తారు.
\s5
\p
\v 9 బానిస విశ్వాసులు ఎప్పుడూ తమ యజమానులకు లోబడి ఉండాలి. తమ యజమానులకు ఎదురు చెప్పకుండా ప్రతి విషయంలోనూ వారిని సంతోషపెడుతూ ఉండాలి వాళ్లతో తగాదాలు పెట్టుకోకూడదు.
\v 10 వాళ్ళు తమ యజమానులకు చెందిన చిన్న చిన్న వస్తువులు కూడా దొంగతనం చెయ్యకూడదు. యజమానులకు నమ్మకంగా పనిచేయాలి. మనల్ని రక్షించిన దేవుని గురించిన ప్రతి బోధా ప్రజల మెప్పు పొందేలా వారి ప్రవర్తన వుండాలి.
\s5
\p
\v 11 విశ్వాసులు ఈ మేలైన మార్గంలో నడుచుకోవాలి. ఎందుకంటే ఎవరికీ అర్హత లేకపోయినా దేవుడు రక్షణ అనే బహుమానాన్ని ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఇస్తున్నాడు.
\v 12 దేవుడు ఉచితంగా యిచ్చే బహుమానంగా మనల్ని రక్షిస్తున్నప్పుడే దానితోపాటు ఆయన చెడు ప్రవర్తనలనూ లోకులు చెయ్యడానికి చూసే వాటినీ మానుకోవడం కూడా నేర్పిస్తాడు. మంచి చేసే ఇంగిత జ్ఞానాన్నీ, మనం జీవించి వున్నఈ ప్రస్తుత కాలమంతా ఆయనకు విధేయులై ఉండడాన్నీ ఆయన మనకు నేర్పిస్తాడు.
\v 13 అదే సమయంలో దేవుడు ఏదయితే భవిష్యత్తులో తప్పక చేయబోతున్నాడో ఆ మహా భాగ్యం కోసం మనం ఎదురు చూడాలని కూడా నేర్పిస్తున్నాడు. అదేమిటంటే యేసు క్రీస్తు మన రక్షకుడు, శక్తిశాలి అయిన దేవుడు మహా తేజస్సుతో మన కోసం తిరిగి వస్తాడన్నది.
\s5
\p
\v 14 మనలను విచ్చలవిడి స్వభావం నుండి విడిపించి, పరిశుభ్రపరిచి మనం తనకు ప్రత్యేకమైన ఆస్తిగా, చురుకుగా మంచి చేయడానికి ఆశపడే ప్రజలుగా మనల్ని మలచాలని చూస్తున్నాడు. అందుకోసం చెల్లించవలసిన మూల్యంగా తనకు తానుగా తన ప్రాణాన్ని ఫణంగా పెట్టాడు.
\s5
\v 15 తీతూ, ఈ విషయాలను గురించి చెబుతూ నేను చెప్పిన విధంగా ఉండేలా విశ్వాసులను కోరుతూ వాళ్ళు తప్పు చేసినప్పుడు సరిదిద్దుతూ అవసరమైనప్పుడు వాళ్ళని అదుపు చేయడానికి నీ అధికారాన్ని ఉపయోగించు. నువ్వు చెప్పే వాటిని అందరూ జాగ్రత్తగా వినేలా చూసుకో.
\s5
\c 3
\p
\v 1 తీతూ, మనవాళ్ళు ప్రభుత్వ అధికారుల నియమ నిబంధనలకు సాధ్యమైనంత వరకు లోబడుతూ ఉండాలని గుర్తు చెయ్యి. వాళ్ళు విధేయతగా నడుచుకుంటూ అవకాశం వచ్చినప్పుడల్లా మంచి పనులు చేయడం ఎంతైనా అవసరం.
\v 2 ఎవరి గురించైనా అగౌరవంగా మాట్లాడటం కానీ, వాదనలు పెట్టుకోవడం కానీ వారికి తగదు. ప్రతి ఒక్కరితోనూ మృదువుగా ప్రవర్తిస్తూ, వాళ్ళను తమకంటే ఎక్కువవారిగా చూడాలి.
\s5
\v 3 గతంలో ఈ విషయాలను మనం ఒప్పుకోకుండా మూర్ఖంగా ఉండేవాళ్ళం. మన కోరికలు, ఆనందాల కోసమైన అభిలాషలు, ఇష్టాలు మనలను తప్పుడు మార్గంలోకి నడిపించాయి. వాటికే మనం బానిసలుగా మారిపోయాం. మనం అస్తమానం ఒకరినొకరు ద్వేషించుకుంటూ, కీడు చేసుకున్నాం. అందరూ మనల్ని అసహ్యించుకునేలా చేసుకున్నాం. ఒకరినొకరు అసహ్యించుకున్నాం.
\s5
\p
\v 4 కానీ దేవుడు మన పట్ల ప్రేమ చూపించి ఎంతో ఉదారంగా మనల్ని రక్షించాడు.
\v 5 మన అంతరంగాలను కడిగి, కొత్త జన్మనివ్వడం ద్వారా, పరిశుద్దాత్మ ద్వారా నూతన వ్యక్తులుగా చెయ్యడం ద్వారా మనలను రక్షించాడు. మంచిపనులు చేస్తున్నామని కాదు గానీ ఆయన కనికర సంపన్నుడు గనకనే మనల్ని రక్షించాడు.
\s5
\v 6 యేసు క్రీస్తు మనల్ని రక్షించినప్పుడే దేవుడు తన పరిశుద్దాత్మను మనకు ధారాళంగా ఇచ్చాడు.
\v 7 ఈ బహుమతి ద్వారా మనకీ, ఆయనకీ మధ్య శాంతి సమాధానాలు ఉన్నాయని ప్రకటించాడు. యేసు ప్రభువు ఇచ్చేదాన్ని ముఖ్యంగా ఆయనతో మనకున్న నిత్యజీవాన్ని పంచుకోవడం కోసం ఆయన మనకు పరిశుద్దాత్మను ఇచ్చాడు.
\s5
\p
\v 8 ఈ మాట నమ్మదగినది. ఈ విషయాలను దేవుణ్ణి నమ్మిన వారికి నువ్వు అస్తమానం నొక్కి చెబుతూ ఉండాలి. అప్పుడు వాళ్ళు ఇతరులకు ఉపయోగపడే విధంగా మంచి పనులు అంకితభావంతో చేయగలుగుతారు. ఈ విషయాలు అత్యంత శ్రేష్ఠమైనవి, అందరికీ మేలు కలిగించేవి.
\s5
\p
\v 9 కానీ అర్థం పర్థం లేని వాదనలకూ, యూదు జాతి వంశావళులను గురించిన వాదోపవాదాలకూ, మతసంబంధమైన వివాదాలకు, దూరంగా వుండు. ఈ రకమైన చర్చలు పనికిమాలినవి, ఏ రకంగాను ఉపయోగం లేనివి.
\v 10 నువ్వు ఒకటికి రెండుసార్లు హెచ్చరించినా కూడా వాళ్ళు గొడవలకి దారితీసే వాటినే పదే పదే కోరుకుంటే ఇక వాళ్ళతో నీకు సంబంధం లేదు.
\v 11 ఎందుకంటే ఇలాటి వాళ్ళు సత్యం నుండి దూరంగా వెళ్లిపోయి పాపం చేస్తూ తమకు తామే శిక్ష విధించుకుంటున్నారని నీకు తెలుసు.
\s5
\p
\v 12 అర్తెమానుగాని, తుకికునుగాని నీ దగ్గరకి పంపుతాను. అప్పుడు నువ్వు నికొపొలికి రావడానికి ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే నేను అక్కడే చలికాలం గడపాలనుకుంటున్నాను.
\v 13 న్యాయకోవిదుడు జేనాకు , అపోల్లోకు అవసరమైన వాటన్నిటినీ ఇచ్చి వారి ప్రయాణానికి చేయగల సహాయమంతా చెయ్యి.
\s5
\v 14 ఇలాగే మనవాళ్లు తమంతట తామే అవసరతలలో వున్న ప్రజలందరికి మేలు చేసేలా చూడు. ఇలా చేస్తే వాళ్ళ జీవితాలు దేవునికి ఉపయోగకరంగా ఉంటాయి.
\s5
\v 15 తీతూ, నాతో ఉన్నవారందరూ నీకు వందనాలు చెబుతున్నారు. విశ్వాసాన్ని బట్టి మమ్మల్ని ప్రేమిస్తున్న మన స్నేహితులందరికీ మా నమస్కారాలు. దేవుడు తనదైన గొప్ప కరుణ మన అందరి యెడలా చూపును గాక.